ఎన్నిక కోసం ప్రేమ.. ప్రేమ కోసం పెళ్లి! నామినేషన్ వేసి అదే రోజు పెళ్లి చేసిన జంట సంచలనం | Sangareddy

సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక ఆచర్యకరమైన సంఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎన్నికల వేళల్లో తమ భార్యలను లేదా బంధువులను సర్పంచ్ బరిలో నిలపడం చాలా చోట్ల చూసినా, ఈ యువకుడి ఆలోచన మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తాళ్లపల్లి గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్, సర్పంచ్ పదవికి పోటీ చేయాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ రిజర్వేషన్ ప్రమాణాల ప్రకారం ఈసారి సర్పంచ్ పదవి ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఆయన కలలు అద్దంలోపడ్డాయి.

అయితే అక్కడే ఆగకుండా, ఒక కొత్త ఆలోచనకు రూపం ఇచ్చాడు. కొన్నాళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రేయసి శ్రీజ ఎస్సీ కులానికి చెందినది కావడంతో, ఆమెను సర్పంచ్ బరిలో నిలబెట్టి, అదే రోజున పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు.

శనివారం మధ్యాహ్నం శ్రీజ నామినేషన్ దాఖలు చేయగా, అదే రోజు సాయంత్రం ఇద్దరూ మిత్రులు, స్థానికుల సమక్షంలో కులాంతర వివాహం చేసుకున్నారు.

అంతలో, యువతి తల్లిదండ్రులు ఆమె కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనితో, చంద్రశేఖర్–శ్రీజలు పోలీసుల ముందు హాజరై:

మేము ఇద్దరం పరస్పరం ప్రేమించుకున్నాం. మా ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాం. గ్రామాభివృద్ధి కోసం పనిచేయాలని మా నిర్ణయం.”

అని తెలిపారు.

ఇదిలావుంటే, ఈ ఇద్దరి రాజకీయ, వ్యక్తిగత నిర్ణయానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మద్దతుగా నిలవడం మరింత ఆసక్తిని రేకెత్తించింది.

గ్రామస్తులలో ఈ జంట ప్రతిపాదన చర్చనీయాంశంగా మారింది. చాలామంది వారి ఆలోచనని చాతుర్యమని పొగుడుతుండగా, కొందరు రిజర్వేషన్ ప్రయోజనాల దుర్వినియోగమని అభిప్రాయ పడుతున్నారు.

ఏది ఏమైనా…

ఒకవైపు ఎన్నిక కోసం ప్రేమ, మరోవైపు ప్రేమ కోసం పెళ్లి
ఈ కథ ఇప్పుడు తెలంగాణ గ్రామీణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *