తీన్మార్ మల్లన్నపై మీడియా నేతల ఆగ్రహం: బీసీ నినాదాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుతున్నారు

తీన్మార్ మల్లన్నపై మీడియా వర్గాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. బీసీ నినాదాన్ని అడ్డుపెట్టుకుని స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ జర్నలిస్టులు, మీడియా సంస్థలపై వరుసగా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వారు మండిపడ్డారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ వేదికగా మీడియా మిత్రులు ఈ వ్యాఖ్యలు చేశారు.

రమ్యకృష్ణ, చిలుక ప్రవీణ్‌తో పాటు పలు మీడియా సంస్థలు, ముఖ్యంగా ఓకే టీవీ సహా కొన్ని ఛానళ్లను టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడం వెనుక రాజకీయ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. బీసీ సమాజం పేరుతో పెట్టిన కేసులన్నీ కూడా వాస్తవానికి ఆయన పార్టీకి చెందిన వారిచే దాఖలైనవేనని, పోస్టర్లలో కూడా “బీసీ బిడ్డలు కేసులు పెట్టారు” అని ప్రచారం చేయడం దారి తప్పించే ప్రయత్నమని విమర్శించారు.

సాయిశ్వరాచార్య అనే వ్యక్తి మల్లన్న కార్యాలయానికి ఎందుకు వచ్చాడన్న అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయని మీడియా నేతలు ప్రశ్నించారు. వచ్చిన తర్వాత ఆయన ఎవరితో మాట్లాడాడు, దండం పెట్టడానికి కారణం ఏమిటి, లోపల బెదిరింపులు జరిగాయా అనే విషయాలపై మల్లన్న స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని అన్నారు.

“ఏడ్చే మొగుణ్ని నమ్మొద్దు” అన్న రజనీకాంత్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ, ఇవన్నీ దొంగ ఏడుపులేనని, ఉద్యమాన్ని శవ రాజకీయాల వైపు మళ్లించి తన స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు బీసీ నినాదాన్ని వాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. గతంలో ఆర్టీఆర్, దళిత ఉద్యమాలు, వివిధ రాజకీయ పార్టీల పేర్లతో పూటకో వేషం వేసుకుంటూ తన పబ్బం గడుపుతున్నాడని ఆరోపించారు

మీడియా మిత్రులు మాట్లాడుతూ, జర్నలిజం వల్లే మల్లన్న రాజకీయంగా ఎదిగాడని, ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడిగా మారుతాడని నమ్మి మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. కానీ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత జర్నలిస్ట్ అనే గుర్తింపును మరిచి, కేవలం పంతపు రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“మీడియా చరిత్రను నిర్మించగలదు, అలాగే చరిత్రను కూల్చగలదు” అని హెచ్చరిస్తూ, జర్నలిస్టులు ప్రజా కోణం నుంచి పనిచేస్తారని, ఆ మార్గం తప్పితే మీడియా గట్టిగా ప్రతిస్పందిస్తుందని స్పష్టం చేశారు. మహిళలపై కేసులు పెట్టడం, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కేసులతో బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.

ఇలాంటి కేసులు కొనసాగితే వంద రెట్లు తీవ్రంగా ప్రతిఘటిస్తామని, మల్లన్న మొదలు పెట్టిన ఈ పోరాటాన్ని మీడియానే పూర్తి చేస్తుందని హెచ్చరిస్తూ మీడియా నేతలు తమ ప్రసంగాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *