ఒక రాయి అందమైన శిల్పంగా మారాలంటే సరైన శిల్పి చేతిలో పడాలి… అలాగే ఒక నటుడు సూపర్ స్టార్‌గా ఎదగాలంటే సరైన దర్శకుడి కాంబినేషన్ కుదరాలి. అలాంటి మ్యాజికల్ కాంబినేషన్లు తెరపైకి వచ్చినప్పుడే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవుతాయి. అలాంటి అరుదైన సూపర్ హిట్ కాంబినేషన్‌లలో ఒకటి హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్.
2012లో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా అప్పటి తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు, బాక్సాఫీస్ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌కు కొత్త ఊపునిచ్చిన ఈ సినిమా, అప్పటివరకు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శృతిహాసన్‌కు కూడా స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌లోని మాస్ ఎనర్జీని తెరపై అద్భుతంగా చూపించడంలో హరీష్ శంకర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు.
అలాంటి ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మళ్లీ 13 ఏళ్ల తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా, పవన్ కళ్యాణ్ ఒకవైపు హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్స్, మరోవైపు డిప్యూటీ సీఎం బాధ్యతల కారణంగా ఆలస్యమైంది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు డేట్స్ కేటాయించడంతో సినిమాను త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ‘దేక్ లెంగే సాలా’ ఫస్ట్ సింగిల్‌ను ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భాస్కరభట్ల రాసిన ఈ పాటను విశాల్ దద్లాని, హరిప్రియ ఆలపించగా, సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందించారు.
ఇప్పటికే విడుదలైన సాంగ్ ప్రోమోలో పవన్ కళ్యాణ్ స్టెప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ డాన్స్ పరఫార్మెన్స్ మోస్తరుగా ఉంటుందని చెప్పుకునే ఆడియన్స్ కూడా, హరీష్ శంకర్ సినిమాలో మాత్రం ఆయనలోని డాన్సర్ బయటకు వస్తాడని మరోసారి ఒప్పుకుంటున్నారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్‌లో అదే మాస్ జోష్ కనిపిస్తోంది అనే కామెంట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
54 ఏళ్ల వయసులో కూడా హై ఎనర్జీ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను చూస్తే, ఆయనలోని నటుడిని హరీష్ శంకర్ ఏ స్థాయిలో బయటకు తీస్తారో మరోసారి అర్థమవుతోంది. ఇక ఈరోజు విడుదల కానున్న పూర్తి పాటకు పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్‌కు ఫ్యాన్స్ ఎన్ని మార్కులు వేస్తారో చూడాల్సిందే.

