భర్తను హత్య చేసిన భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో మరో హృదయ విదారక ఘటనలో ఐదుగురు పిల్లలకు ఉరివేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు సమాజాన్ని కుదిపేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. రాత్రి 1 గంట వరకే వేడుకలకు అనుమతి ఉంటుందని, సౌండ్ సిస్టమ్స్ రాత్రి 10 గంటలకే నిలిపివేయాలని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. అశ్లీలతకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని, వేడుకల కోసం కనీసం 15 రోజుల ముందే అనుమతి తీసుకోవాలని సూచించారు. అయితే ఈ నిబంధనలు సామాన్య ప్రజలకేనా? లేక రాజకీయ నాయకులు, అధికార పార్టీ నేతలకు కూడా వర్తిస్తాయా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇక హైదరాబాద్ పోలీస్ శాఖలో అవినీతి ఆరోపణలపై సీపీ సజ్జనార్ గట్టి చర్యలకు సిద్ధమయ్యారు. కొందరు ఏసీపీలు, ఎస్హెచ్ఓలు అక్రమాలకు పాల్పడుతున్నారని, కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తూ డబ్బు దందాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు సీపీ దృష్టికి వెళ్లాయి. దీంతో ఏడు జోన్లతో పాటు సైబర్ క్రైమ్, సీసీఎస్ విభాగాల్లోని కొందరు ఏసపీలపై స్పెషల్ ఫోకస్ పెట్టి అంతర్గత విచారణకు ఆదేశించినట్టు సమాచారం.
ఇటీవల నార్త్ జోన్‌లోని ఓ ఏసపిపై డీజీకి నివేదిక వెళ్లడంతో ఆయన్ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. డబ్బుల కోసం కింది స్థాయి సిబ్బందికి టార్గెట్లు ఇవ్వడం, వ్యక్తిగత పరిచయాలతో వీఐపీ సౌకర్యాలు పొందడం వంటి అంశాలు విచారణలో బయటపడినట్టు సమాచారం. నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖ పరువును దెబ్బతీస్తే చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
అయితే, ఈ చర్యలు హైదరాబాద్‌కే పరిమితమా? రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలోనూ ఇదే పరిస్థితి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎఫ్ఐఆర్లు నమోదు కాకపోవడం, బాధితుల గోడు వినిపించుకోకపోవడం, పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి వంటి సమస్యలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి.
మొత్తానికి, కోర్టుల తీర్పుల నుంచి పోలీస్ వ్యవస్థలోని లోపాల వరకు – ఇవన్నీ సమాజానికి అద్దం పట్టే ఘటనలుగా మారాయి. అంతర్గత విచారణలు కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా, నిజమైన సంస్కరణలకు దారితీయాలన్న డిమాండ్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

