ఇంటర్ విద్యార్థి మృతి కేసులో కాలేజీ నిర్లక్ష్యం?“మాతో మాట్లాడనీయలేదు… ఫీజులే గుర్తొచ్చాయి” – తల్లిదండ్రుల ఆవేదన

ఇంటర్ విద్యార్థి మృతి కేసులో కాలేజీ నిర్లక్ష్యం?

“మా బాబుతో మాట్లాడనీయలేదు… ఫీజుల కోసం తప్ప ఇంకేమీ పట్టించుకోలేదు” – తల్లిదండ్రుల ఆవేదన

ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సంబంధిత కాలేజీ యాజమాన్యం, హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందనే ఆరోపణలు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు లేవనెత్తుతున్నాయి.

బాధిత విద్యార్థి తల్లి మాట్లాడుతూ, “కాలేజీలో జాయిన్ చేసే సమయంలో 120 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారని, ఒక్కో గదిలో ముగ్గురు లేదా నలుగురు ఉంటారని చెప్పారు. మొదట అన్నీ బాగానే అనిపించాయి. కానీ తర్వాత మాకు మా బాబుతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. మేము వచ్చినా గంటసేపు కూర్చోబెట్టేవాళ్లు తప్ప పిల్లాడిని కలవనివ్వలేదు” అని వాపోయారు.

చివరి ఫోన్ కాల్‌లో ఆవేదన

ఘటనకు రెండు రోజుల ముందు రాత్రి తమ కుమారుడు ఫోన్ చేసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడని తల్లి తెలిపింది.
“మమ్మీ… నాకు ఎట్లనో అనిపిస్తోంది, మీరు నా కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని వాళ్లు అంటున్నారు” అంటూ బాధపడ్డాడని ఆమె కన్నీళ్లతో వివరించారు. ఆ తర్వాత మరుసటి రోజు మాట్లాడతానని చెప్పి ఫోన్ కట్ చేశాడని తెలిపారు.

అవుటింగ్‌కు కూడా అనుమతి లేదు

తల్లిదండ్రులు అడిగినా అవుటింగ్‌కు అనుమతించలేదని, హాస్టల్‌లో పిల్లలపై పర్యవేక్షణ లేదని ఆరోపించారు.
“మా బాబు యాక్టివ్‌గా ఉంటాడు. ఎప్పుడూ కనిపెట్టుకుంటూ ఉండేవాళ్లం. కానీ కాలేజీ వాళ్లు ఒక్కసారి కూడా ‘మీ బాబు ఇలా ఉన్నాడు’ అని చెప్పలేదు. ఫీజుల కోసం మాత్రం వెంటనే ఫోన్ చేస్తారు” అని విమర్శించారు.

అటెండెన్స్, సీసీ ఫుటేజ్‌పై అనుమానాలు

విద్యార్థి సంఘాలు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి.
“విద్యార్థి క్లాస్‌రూమ్‌కు రాకపోతే అటెండెన్స్‌లో ఎలా కనిపించలేదు? ఎప్పుడు బయటకు వెళ్లాడు? హాస్టల్‌కు ఎప్పుడు చేరాడు? సీసీ కెమెరా ఫుటేజ్ ఉండాలి. యాక్యూరేట్ టైం డేటా లేకపోతే నిజాలు ఎలా బయటపడతాయి?” అని ప్రశ్నించాయి.

డిసెంబర్ తర్వాత పెరిగే ఒత్తిడి

ప్రతి విద్యా సంవత్సరంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుందని, ఈ సమయంలో కాలేజీలు ప్రత్యేక పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందని విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి.
“వార్డెన్లు సరిపడా ఉంటే, గదులపై నిఘా ఉంటే ఈ ఘటన జరిగేది కాదు” అని ఆరోపించాయి.

హాస్టల్ భద్రతపై ప్రశ్నలు

ఘటన జరిగిన సమయంలో డోర్లు లాక్ అయ్యాయా? ఎవరైనా అడ్డుకునే అవకాశం లేదా? అనే అంశాలపై స్పష్టత లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు.
“మా బాబును వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారని చెబుతున్నారు. కానీ అప్పటివరకు ఏం జరిగిందన్నది ఇప్పటికీ మాకు క్లారిటీ లేదు” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

విచారణ కోరుతున్న కుటుంబం

ఈ ఘటనలో ఇది వ్యక్తిగత కారణమా? లేక కాలేజీ, హాస్టల్ నిర్లక్ష్యమా? అన్నది సమగ్ర దర్యాప్తులో తేలాల్సి ఉందని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీసీ ఫుటేజ్, అటెండెన్స్ రికార్డులు, వార్డెన్ డ్యూటీ వివరాలు బయటపెట్టాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *