న్యూ ఇయర్ వేడుకలపై ఎక్సైజ్ కఠిన ఆంక్షలు.. డ్రగ్స్ వాడితే పీడీ కేసులు, ఈవెంట్ పర్మిషన్ తప్పనిసరి

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. వేడుకల ముసుగులో డ్రగ్స్, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వాడితే పీడీ యాక్ట్ కింద కేసులు తప్పవని అధికారుల గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్ పర్మిషన్ లేకుండా వేడుకలు నిర్వహిస్తే నేరుగా జైలుకే పంపిస్తామని స్పష్టం చేశారు.

ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. కేవలం డిసెంబర్ 31 రోజు మాత్రమే కాకుండా, వారం రోజుల ముందే నిఘా పెంచనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందుకు ఎస్టీఎఫ్, డీటీఎఫ్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి.

రాష్ట్ర సరిహద్దుల్లోని 20 కీలక చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాకుండా ప్రతి వాహనాన్ని జల్లెడ పట్టనున్నారు. రోడ్డు మార్గాలే కాకుండా రైళ్లలో కూడా తనిఖీలు చేపట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయనున్నారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో ప్రధాన రహదారులపై రూట్ వాచ్ నిర్వహించడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా కఠినంగా అమలు చేయనున్నారు.

నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే క్లబ్బులు, పబ్బులు, ప్రైవేట్ రిసార్ట్లు తప్పనిసరిగా ఎక్సైజ్ శాఖ నుంచి ఈవెంట్ పర్మిషన్ తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 31న వైన్ షాపులు రాత్రి 12 గంటల వరకు, బార్లు, క్లబ్బులు రాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే నిర్ణీత సమయం దాటిన తర్వాత మద్యం విక్రయిస్తే, లేదా అనుమతించిన కోటా కంటే ఎక్కువ మద్యం అమ్మితే లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

వేడుకల పేరుతో యువత తప్పుదారి పట్టకుండా, మాదకద్రవ్యాల సరఫరా చేసే నెట్‌వర్క్‌లను పూర్తిగా ఛేదించేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అక్రమ మద్యం బాటిళ్లు తరలించే వారిపై నిఘా పెంచడంతో పాటు, డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ శానా వాజ్ ఖాసిం మాట్లాడుతూ, “వేడుకలు చేసుకోవడాన్ని ప్రభుత్వం వ్యతిరేకించదు. కానీ మత్తులో మునిగి చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. నూతన సంవత్సరాన్ని బాధ్యతాయుతంగా జరుపుకోవాలి” అని సూచించారు.

మొత్తానికి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. డ్రగ్స్, అక్రమ మద్యం, చట్టవిరుద్ధ ఈవెంట్లపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సిద్ధమవడంతో, ఈసారి నూతన సంవత్సరం వేడుకలు కఠిన నిఘా మధ్య జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *