ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్స్.. తరతరాల ట్రెండ్స్‌ను మార్చిన దర్శకులు
ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి మనుషుల ఆలోచన విధానం మారుతుంది. దాన్నే కొందరు ట్రెండ్ అంటారు, మరికొందరు జనరేషన్ అంటారు. కానీ ప్రతి తరంలోనూ ఆలోచనల్ని మార్చి కొత్త దిశ చూపించే వ్యక్తి మాత్రం ఒకడే ఉంటాడు. వాడే టార్చ్ బేరర్. ఈ మాటలు అరవింద సమేత సినిమాలో రావురమేష్ డైలాగ్‌లా కనిపించినా, అవి ఇండియన్ సినిమా చరిత్రకు అచ్చంగా సరిపోతాయి.
భారతీయ సినిమా గత కొన్ని దశాబ్దాలుగా అనేక మార్పులను చవిచూసింది. ముఖ్యంగా కొందరు దర్శకులు తమ ఆలోచనలతో, కథన శైలితో, మేకింగ్‌లో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులతో ఇండియన్ సినిమాను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి గేమ్ ఛేంజర్స్లో ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ, ఎస్.ఎస్. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, ఆదిత్య ధర్ పేర్లు ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
1989కి ముందు వరకూ తెలుగు సినిమాలు ఒకే తరహా మేకింగ్, రొటీన్ హీరో క్యారెక్టరైజేషన్‌తో సాగేవి. ఆ సమయంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమా ఇండియన్ సినిమా రూపురేఖలనే మార్చేసింది. రియలిస్టిక్ మేకింగ్, న్యూ ఏజ్ హీరోయిజం, ఇంటెన్స్ కథనంతో ఈ సినిమా అప్పటివరకు ఉన్న ట్రెండ్‌ను పూర్తిగా బ్రేక్ చేసింది. హీరో అంటే ఇలా కూడా ఉండొచ్చా అనే ఆలోచనను ప్రేక్షకులలో నాటింది.
ఆ తర్వాత వచ్చిన అతి పెద్ద గేమ్ ఛేంజర్ ఎస్.ఎస్. రాజమౌళి. ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు నాంది పలికారు. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి విజువల్స్, మూడు సంవత్సరాల మేకింగ్ టైమ్… ఇవన్నీ అప్పట్లో ఇండియన్ సినిమాకు అసాధ్యంగా అనిపించాయి. కానీ బాహుబలి ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపింది. పార్ట్ 2 అయితే ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రనే మార్చేసింది.
ఇదే సమయంలో మరో విప్లవాత్మక దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా హీరో క్యారెక్టరైజేషన్లో సరికొత్త చర్చకు తెరలేపింది. కథ నడిచే విధానం, నిడివి, ఇంటర్వెల్ బ్యాంగ్, హీరో బిహేవియర్… అన్నీ సంప్రదాయాలకు భిన్నంగా ఉండటంతో ఈ సినిమా పాథ్ బ్రేకింగ్ ఫిల్మ్‌గా నిలిచింది. బాలీవుడ్లో రీమేక్ అయినప్పటికీ అదే స్థాయిలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్‌తో చేసిన యానిమల్ సినిమాతో కంటెంట్ పరంగా మరింత చర్చకు దారితీశాడు.
ఇప్పుడు తాజా గేమ్ ఛేంజర్‌గా నిలుస్తున్న పేరు ఆదిత్య ధర్. రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ధురంధర్ సినిమాతో ఇండియన్ స్పై యాక్షన్ జానర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్, నేటి రాజకీయ పరిస్థితులకు దగ్గరగా ఉండే కథ, కొత్త తరహా మేకింగ్ ఈ సినిమాను వేరే స్థాయిలో నిలిపాయి. సినిమా రిలీజ్ విధానంలో కూడా కొత్త ప్రయోగం చేసి బ్లాక్ బస్టర్ సాధించడం విశేషం.
మొత్తంగా చూస్తే, రామ్ గోపాల్ వర్మ నుంచి ఆదిత్య ధర్ వరకు ఈ దర్శకులందరూ తమ తమ కాలాల్లో ఇండియన్ సినిమాకు కొత్త దారులు చూపారు. వీళ్లే నిజమైన గేమ్ ఛేంజర్స్. తరతరాల ఆలోచనలను మార్చి, భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన టార్చ్ బేరర్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

