నల్గొండ బీజేపీలో ఆధిపత్య పోరు: వాజ్‌పేయి జయంతి వేదికగా నాయకుల మధ్య ఘర్షణ

నల్గొండ బీజేపీలో ఆధిపత్య పోరు: వాజ్‌పేయి జయంతి వేదికగా నాయకుల మధ్య ఘర్షణ

నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి సందర్భంగా గురువారం నల్గొండలో నిర్వహించిన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం ఘర్షణకు దిగారు. చొక్కాలు పట్టుకోవడం, కుర్చీలు విసరుకోవడం, ఒక దశలో పిడిగుద్దుల వరకు పరిస్థితి చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించాలని పార్టీ జిల్లా నాయకత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వాజ్‌పేయి జయంతి కార్యక్రమంలో వారిని సన్మానించేందుకు పార్టీ నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ తన అనుచరులతో కలిసి సాలువాలు, పుష్పగుచ్చాలతో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

అయితే సన్మాన కార్యక్రమం వాయిదా పడిందని, ఈరోజు సన్మానం నిర్వహించవద్దని జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు రామరాజుకు తెలిపారు. దీనిపై ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. “సన్మానం చేయవద్దని చెప్పడానికి నువ్వెవరు?” అంటూ రామరాజు ప్రశ్నించగా, వర్షిత్ రెడ్డి కూడా అదే స్థాయిలో స్పందించారు. మాట మాట పెరిగి ఇరువర్గాల అనుచరులు ఆగ్రహంతో ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘర్షణ మరింత తీవ్రం కాకుండా పరిస్థితిని నియంత్రించారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఫోటో, వీడియో జర్నలిస్టులు తమ కెమెరాల్లో బంధించారు. అయితే ఫోటోలు తీసిన ఒక జర్నలిస్టు నుంచి జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి కెమెరా లాక్కొని డేటా తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి నిరసనగా ఫోటో, వీడియో జర్నలిస్టులు ధర్నాకు దిగారు. చివరికి వర్షిత్ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

ఈ ఘటన బీజేపీలో సరైన నాయకత్వం లేకపోవడం వల్లే చోటుచేసుకుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పై స్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలు, కార్యాచరణ లేకపోవడంతో స్థానిక నాయకులు సొంత నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని గందరగోళానికి గురి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గెలిచిన సర్పంచులను సన్మానించాలా వద్దా అన్న అంశంపైనే ఇంత పెద్ద ఘర్షణ చోటుచేసుకోవడం పార్టీ పరిస్థితిని ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

పార్టీలో నాయకత్వానికి స్పష్టత లేకపోవడం, కార్యకర్తల్లో ఉత్సాహం కలిగించేలా మాట్లాడే నాయకుడు లేకపోవడం బీజేపీకి పెద్ద లోటుగా మారిందని కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తీవ్ర నష్టం తప్పదని, డిపాజిట్లు కూడా దక్కుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్గొండ ఘటన బీజేపీలో పెరుగుతున్న అంతర్గత కలహాలకు నిదర్శనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *