మన శంకరవరప్రసాద్ గారు.. అసలు సర్‌ప్రైజ్ ఆ రోజే! ట్రైలర్ డేట్‌తో మాస్ హీట్ పెంచిన చిరు

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే అందరూ ఒక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ని ఊహించుకున్నారు. కానీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ (MSG) నుంచి వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే లెక్క పూర్తిగా మారుతున్నట్టు కనిపిస్తోంది. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా ప్రమోషన్లను మరింత వేగవంతం చేసిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించి ఫ్యాన్స్‌లో హీట్ పెంచేసింది.

జనవరి 4న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. వైట్ షర్ట్, డార్క్ ప్యాంట్‌లో చేతిలో షాట్ గన్ పట్టుకుని, మోకాళ్లపై కూర్చున్న చిరంజీవి లుక్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. చుట్టూ గాల్లో ఎగురుతున్న కాగితాలు, వెనుక యాక్షన్ మూడ్ చూస్తే… ఇది కేవలం కామెడీ సినిమా కాదు, పక్కా మాస్ యాక్షన్ డ్రామా అని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రగ్గడ్ లుక్‌లో చిరు కనిపిస్తుంటే వింటేజ్ చిరంజీవి రోజులు గుర్తుకు వస్తున్నాయి.

సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాలు అంటే నవ్వులు, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయి. కానీ ఈ పోస్టర్ చూస్తే ఈసారి ఆయన క్రైమ్ డ్రామా ఛాయలతో కూడిన హై వోల్టేజ్ యాక్షన్‌ని డిజైన్ చేసినట్టు అనిపిస్తోంది. మాస్ ఎలిమెంట్స్‌ను బలంగా మేళవిస్తూ, చిరంజీవి ఇమేజ్‌కు తగ్గ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసినట్టు ఈ లుక్ హింట్ ఇస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు మాస్ ఫ్యాన్స్‌కూ ఈ సినిమా ఫుల్ మీల్‌లా ఉండబోతోందని టాక్.

ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ విక్టరీ వెంకటేష్. ఆయన కీలక పాత్రలో నటిస్తుండటంతో ఇది ఈ సీజన్‌లోనే అతిపెద్ద మల్టీస్టారర్‌గా మారింది. చిరు–వెంకీ కాంబినేషన్‌ను స్క్రీన్‌పై చూడటం అంటే ఆడియెన్స్‌కు కన్నుల పండుగే. అంతేకాదు, లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఇప్పటికే సినిమాపై బజ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. “మీసాల పిల్ల”, “సంక్రాంతి అదిరిపోద్ది” వంటి పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచి సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వైరల్ అవుతున్నాయి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాణ విలువలు కూడా పోస్టర్లలోనే గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి.

జనవరి 4న ట్రైలర్‌తో అసలైన విశ్వరూపం చూపించడానికి టీమ్ రెడీ అయింది. ఇక సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సంక్రాంతి పండగకు ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్‌గా ‘మన శంకరవరప్రసాద్ గారు’ నిలుస్తుందని, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రైలర్‌లో అనిల్ రావిపూడి ఇంకెన్ని సర్‌ప్రైజ్‌లు దాచాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *