గృహజ్యోతి పథకంపై ఎమ్మెల్యే ప్రశంసలు, టెక్నికల్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలలో అత్యంత కీలకమైన పథకంగా గృహజ్యోతి పథకాన్ని పేర్కొంటూ, ఈ పథకం వల్ల పేద కుటుంబాలకు నిజమైన ఊరట లభిస్తోందని అసెంబ్లీలో ఎమ్మెల్యే తెలిపారు. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సంబంధిత మంత్రికి తన నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
గతంలో నెల చివర్లో కరెంట్ బిల్లుల భారం కుటుంబాలపై తీవ్ర ఒత్తిడిగా ఉండేదని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళలు బిల్లు కట్టలేకపోతే కరెంట్ కట్ చేస్తారేమోనన్న భయంతో అప్పులు చేసి అయినా బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారని చెప్పారు. సమయానికి బిల్లు కట్టకపోతే పెనాల్టీలు విధించిన సందర్భాలు కూడా గత ప్రభుత్వంలో చూశామని ఆయన అన్నారు.
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఉచిత కరెంట్ అందించారని గుర్తు చేసిన ఎమ్మెల్యే, నేడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గృహాలకు కూడా ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. గృహజ్యోతి పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి కుటుంబాలు గణనీయమైన ఆర్థిక ఊరట పొందుతున్నాయని పేర్కొన్నారు.
అయితే ఈ పథకం అమలులో కొన్ని చిన్న టెక్నికల్ సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకువచ్చారు. జీరో బిల్ అమలు సమయంలో ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరించామని, అయితే ఆ సమయంలో కొందరు అర్హులైన వారు దరఖాస్తు చేయలేకపోయారని తెలిపారు. అలాంటి నిజమైన లబ్ధిదారులకు మరో అవకాశం కల్పించాలని మంత్రి ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు ఒకే జీరో బిల్ వచ్చి, తర్వాత కుటుంబ విభజన జరిగి విడివిడిగా రేషన్ కార్డులు వచ్చిన సందర్భాల్లో, కొత్తగా వేరు కుటుంబంగా మారిన వారికి కూడా గృహజ్యోతి పథకం వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. కిరాయి ఇంట్లో ఉండగా జీరో బిల్ పొందిన వారు, తర్వాత సొంత ఇంటికి మారినప్పుడు కొత్త చిరునామాకు బిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావడానికి ఆరు నెలల సమయం పడుతోందని, దీనిని తగ్గించి వేగవంతంగా అమలు చేయాలని సూచించారు.
ఇంకొక సమస్యగా, ఒక నెల 200 యూనిట్లలోపే వినియోగించి జీరో బిల్ వచ్చినప్పటికీ, తదుపరి నెల 200 యూనిట్లు దాటితే బిల్ రావడం, ఆ తరువాత నెల మళ్లీ 200 యూనిట్లలో ఉంటే కూడా జీరో బిల్ రాకపోవడం వంటి ఫిర్యాదులు లబ్ధిదారుల నుంచి వస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇవి చిన్న టెక్నికల్ సమస్యలే అయినప్పటికీ, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని అన్నారు.
తన నియోజకవర్గానికి సంబంధించి మొత్తం సుమారు 62 వేల కుటుంబాలు ఉండగా, అందులో 46 వేల కుటుంబాలు గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నాయని, వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ప్రస్తుతం దాదాపు 90 శాతం కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందుతున్నదని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ విషయంపై తన నియోజకవర్గ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు.
ఈ పథకం భవిష్యత్తులో కూడా కొనసాగాలని, ఉన్న టెక్నికల్ సమస్యలను పూర్తిగా పరిష్కరించి మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సన్నబియ్యం, జీరో బిల్ వంటి పథకాలపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, గతంతో పోలిస్తే ఇప్పుడు జీవితం సులభమైందని ప్రజలు చెబుతున్నారని ఆయన తెలిపారు.
చివరిగా గృహజ్యోతి పథకం సామాన్య ప్రజలకు నిజంగా ఉపయోగపడుతున్న గొప్ప పథకమని, ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదని పేర్కొంటూ, ఈ పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని అభినందిస్తూ, మిగిలిన సమస్యలు కూడా త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

