నగరానికి సంక్రాంతి శోభ.. పల్లెబాట పట్టిన పట్టణం

నగరానికి సంక్రాంతి శోభ వచ్చేసింది. పండుగ సెలవులు సమీపించడంతో పట్టణం నుంచి పల్లెలకు జనస్రవంతి బయలుదేరింది. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పాటు వీకెండ్ కూడా కలిసి రావడంతో నగరవాసులు పెద్ద ఎత్తున స్వగ్రామాల బాట పట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం క్రమంగా ఖాళీ అవుతుండగా, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మాత్రం ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.

ఈ రోజు నగరవ్యాప్తంగా పాఠశాలల్లో ముందస్తుగా సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. రేపటి నుంచి సెలవులు కావడంతో ఈ సాయంత్రమే చాలామంది ఊర్లకు బయలుదేరారు. శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు ఉండటం, ఆఫీసులకు వీకెండ్ కావడంతో నగరమంతా ఒక్కసారిగా ప్రయాణాల హడావుడితో నిండిపోయింది.

వీకెండ్‌, స్కూళ్ల సెలవులు కలిసి రావడంతో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. మరోవైపు సొంత వాహనాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రజలు స్వగ్రామాలకు వెళ్తుండటంతో ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ తీవ్రంగా పెరిగింది.

హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లే రహదారులపై భారీ రద్దీ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్–విజయవాడ 65వ జాతీయ రహదారి పూర్తిగా ట్రాఫిక్‌తో నిండిపోయింది. పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు ముందస్తు ప్రణాళికతో ప్రయాణాలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదిలా ఉండగా, సంక్రాంతి సెలవులకు ఊరెళ్లే వారు తప్పనిసరిగా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

ఊరికి వెళ్లే ముందు విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు భద్రపరుచుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వాటికి నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అలాగే చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వాలని, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను మోహరించామని, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

మొత్తానికి సంక్రాంతి పండుగ వేళ నగరం నుంచి పల్లెలకు ప్రజలు తరలిపోతుండటంతో పట్టణం ఖాళీగా మారుతుండగా, గ్రామాలు మాత్రం పండుగ సందడితో కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *