రేవంత్ రెడ్డి నిజంగా గెలవాలనుకుంటున్నారా? లేక మాటలకే పరిమితమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే ప్రజల తీర్పు ఏమిటో స్పష్టంగా చెప్పబోతున్నాయని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాంగ్రెస్ నాయకులు జీహెచ్ఎంసీపై తమకే విజయం ఖాయమంటూ చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. “సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 60 శాతం వచ్చినా, మాకు 40 శాతం వచ్చింది. బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. 10 శాతం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ కూడా మాదే వస్తుంది” అని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని ఎమ్మెల్యేలు ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచే ఉన్నారని, ప్రజలు పార్టీ మార్పులను సమర్థించలేదని వారు పేర్కొన్నారు. గతంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ పార్టీ మారిన సందర్భంలోనూ ప్రజలు వ్యక్తికి కాదు, కేసీఆర్‌కే ఓటు వేశారని గుర్తుచేశారు. “మేము వ్యక్తుల వల్ల గెలవలేదు, పార్టీ బలంతో గెలిచాం” అని వ్యాఖ్యానించారు.
ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కూడా బీఆర్ఎస్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “నిజంగా బీఆర్ఎస్లోనే ఉన్నామనుకుంటే అసెంబ్లీలో మా వైపే కూర్చోవాలి. తెలంగాణ భవన్‌కు వచ్చి మీడియా ముందు మాట్లాడాలి. అంత ధైర్యం లేకపోతే నోరు మూసుకోవాలి” అంటూ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ నేతలు పదిమంది ఎమ్మెల్యేలు తమవైపుకు వస్తారని చెబుతున్న వ్యాఖ్యలను బీఆర్ఎస్ కొట్టిపారేసింది. “వాళ్లకు కాంగ్రెస్ టికెట్ ఇస్తారా? ఇచ్చే దమ్ముందా? అసలు ఆ విషయమే వారికి తెలుసు” అంటూ ఎద్దేవా చేసింది.
కేటీఆర్‌పై జరుగుతున్న విమర్శలపై కూడా బీఆర్ఎస్ మండిపడింది. “మా పార్టీ వల్ల గెలిచినవాళ్లు మళ్లీ అదే పార్టీ నేతలను తిడితే ప్రజలు క్షమించరు. పార్టీ కండవేసుకొని గెలిచిన వాళ్లు ఆ కండవిలువ ఏంటో తెలుసుకోవాలి” అని హెచ్చరించింది.
మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్నికలే రేవంత్ రెడ్డి రాజకీయ బలం ఏంటో, కాంగ్రెస్‌కు నిజంగా ప్రజాదరణ ఉందో లేదో తేల్చబోతున్నాయని బీఆర్ఎస్ స్పష్టం చేస్తోంది. మాటలతో కాదు, ఎన్నికల ఫలితాలతోనే అసలు నిజం బయటపడుతుందని పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు.

