తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన చర్చాంశంగా నిలుస్తున్నది బీసీ వర్గాల రిజర్వేషన్ల విషయం. రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయం చుట్టూ తీవ్ర రాజకీయ వేడి నెలకొంది. హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న వేళ, సుప్రీం కోర్టు మార్గదర్శకాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఆమాద్మీ పార్టీ మహిళా నాయకురాలు హేమ జిల్లోజి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందే ప్రజల్లో నెగిటివ్ ఇమేజ్ ఉన్నందున ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశాన్ని రాజకీయ స్ట్రాటజీగా వాడుకుంటున్నారు. ప్రజా ప్రయోజనం కన్నా ఓటు బ్యాంక్ రాజకీయాలే ప్రధానంగా మారాయి” అని వ్యాఖ్యానించారు.
ఆమె ఇంకా పేర్కొంటూ, “ప్రభుత్వం నిజంగా బీసీలను ప్రోత్సహించాలనే సంకల్పం ఉంటే, గత రెండేళ్ల క్రితమే రిజర్వేషన్లను అమలు చేసేది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని ప్రస్తావించడం పూర్తిగా ఓటర్లను ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నం మాత్రమే” అని చెప్పారు.
హేమ జిల్లోజి గారు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న రాజకీయ ఒత్తిడులపై కూడా విమర్శలు చేశారు. “బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నట్టే కనిపించినా వాస్తవానికి ఇవి ఒకే నాణెం రెండు వైపుల్లాంటివి. ప్రజల మద్దతును పొందడానికి రెండూ డ్రామాలే ఆడుతున్నాయి,” అని ఆమె అన్నారు.
తాజా పరిణామాలపై మాట్లాడుతూ, ఆమె “42% రిజర్వేషన్ అమలు కావడం అనేది ఇప్పట్లో సాధ్యం కాని పని. హైకోర్టు లేదా సుప్రీం కోర్టు తీర్పులు వచ్చినా, ఈ నిర్ణయాన్ని ఎన్నికల వ్యూహంగా వాడుకుంటారు కానీ, బీసీలకు న్యాయం జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి” అని తెలిపారు.
హేమ జిల్లోజి గారి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీసీ రిజర్వేషన్ అంశం ఎన్నికల సమీపంలో మరింత వేడెక్కనుందనే సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

