డ్రైవింగ్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు చెక్: వికారాబాద్ పోలీసుల అవగాహన కార్యక్రమం

రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా వికారాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటో డ్రైవర్లు, బైక్ డ్రైవర్లు సహా అన్ని రకాల వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.

అధిక వేగంతో వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, ఆటోలలో అనుమతికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి కారణాల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు వివరించారు. ముఖ్యంగా హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు తగిలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు.

ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన బాధ్యత కలిగి ఉంటారని, ప్రయాణికుల ప్రాణాలు తమ చేతుల్లోనే ఉంటాయని గుర్తించాలని పోలీసులు సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఒక్క డ్రైవర్‌కే కాదు, అతనిపై ఆధారపడి ఉన్న కుటుంబం మొత్తం ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతుందని హెచ్చరించారు.

ఇటీవల చేవెళ్ల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని ఉదాహరణగా ప్రస్తావించిన పోలీసులు, ఒక ప్రమాదం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంపాదించే వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబ భవిష్యత్తే అంధకారమవుతుందని తెలిపారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అందులో భాగంగానే పోలీస్ స్టేషన్ స్థాయి నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, మద్యం సేవించి వాహనం నడపకుండా, అధిక వేగానికి దూరంగా ఉండాలని వికారాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *