ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దూకుడు పెంచింది. ఇప్పటికే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును సుమారు ఏడు గంటల పాటు విచారించిన సిట్, తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
కేటీఆర్ పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఆయన కూడా ఊహించని కీలక సాక్ష్యాలను ముందుంచేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని సమాచారం. హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని నోటీసుల్లో పేర్కొన్నారు. నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ బృందం నోటీసు కాపీని ఆయన వ్యక్తిగత సిబ్బందికి అందజేసింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి కేటీఆర్ పేరు వినిపిస్తూనే ఉంది. అయితే ఇప్పటివరకు రిమాండ్ లేదా అరెస్ట్ వంటి చర్యలు లేకపోవడంతో ఈ దర్యాప్తుపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, బిఆర్ఎస్ వర్గాలు ఈ సిట్ నోటీసులను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తూ తేలికగా తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఇప్పటికే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుతో పాటు పలువురు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు నిందితులుగా ఉన్నారు. వారి వాంగ్మూలాల ఆధారంగానే రాజకీయ నేతల వైపు సిట్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
కేటీఆర్ విచారణతో పాటు, త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన వ్యవహారం అప్పటి సీఎం అనుమతి లేకుండా జరగడం అసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. సిట్ విచారణ ఎటువంటి మలుపు తిరుగుతుందో, ఎవరి వరకు చేరుతుందో అన్న ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.

