తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ కెనడీ స్కూల్లో “లీడర్షిప్ ఇన్ 21వ శతాబ్దం” కోర్స్ పూర్తి చేసి సర్టిఫికేట్ పొందడంపై రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో వ్యంగ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత లీడర్‌గా ఎదిగానని నిరూపించుకోవాలన్న భావనతోనే ఈ సర్టిఫికేట్ తీసుకొచ్చినట్లుగా విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తిచేసి సర్టిఫికేట్ చేతిలో పెట్టుకున్నట్టుగా సీఎం ఫోటోలు కనిపిస్తున్నాయని, ఇకపై ఎవరైనా “నువ్వు లీడర్ కాదురా” అని అడిగితే ఈ సర్టిఫికేట్ చూపిస్తాడేమోనని వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రజలు ఎన్నుకున్న నాయకుడికి లీడర్షిప్ సర్టిఫికెట్ అవసరమా? పనితీరే అసలైన సర్టిఫికేట్ కాదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇంకా ఈ విదేశీ పర్యటన ప్రజాధనంతో జరిగిందా? లేక వ్యక్తిగత ఖర్చులతో జరిగిందా? అన్న అంశంపై కూడా చర్చ నడుస్తోంది. ప్రజాధనంతో వెళ్లి వ్యక్తిగత ఇమేజ్ బిల్డింగ్ చేస్తే అది తీవ్రమైన తప్పిదమని, వ్యక్తిగత ఖర్చులతో వెళ్లితే ఇప్పటివరకు తనకు లీడర్షిప్ లేదని సీఎం స్వయంగా ఒప్పుకున్నట్టేనని విమర్శకులు అంటున్నారు.
రేపు సీఎం అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో హడావుడి, ఆర్భాట స్వాగతాలు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే ప్రజలు కోరుకునేది సర్టిఫికేట్లు కాదని, తెలంగాణ సమస్యలకు పరిష్కారాలు, పరిపాలనలో స్పష్టత, బాధ్యతాయుతమైన నాయకత్వమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

