తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మరోసారి విద్యార్థిగా మారి విదేశాల్లో లీడర్షిప్ క్వాలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మళ్లీ చదువు నేర్చుకోవడం తప్పు కాదని, నేర్చుకోవాలనే ఆలోచనను అభినందించాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
“ఎవరైనా చదువు నేర్చుకుంటానంటే తప్పు కాదు. నేను ప్రొఫెసర్ అయినా సరే, ఎవరో ఒకరు చదవాలంటే నేను తప్పకుండా అభినందిస్తాను” అని ఒక నేత వ్యాఖ్యానించారు. అయితే ఈ కోర్సుల వాస్తవ విలువపై మాత్రం ప్రశ్నలు లేవనెత్తారు.
రేవంత్ రెడ్డి తీసుకున్నది పూర్తి స్థాయి పీజీ డిగ్రీ గానీ, డిప్లొమా కోర్సు గానీ కాదని, ఇది కేవలం కొద్ది రోజుల పాటు జరిగే లీడర్షిప్ ట్రైనింగ్ లేదా సెమినార్ లాంటిదేనని తెలిపారు. “డబ్బులు ఉంటే ఇలాంటి కోర్సులు ఎవరైనా చేయగలరు. అడ్మిషన్‌కు ప్రధాన అర్హత మెరిట్ కంటే ఫీజు చెల్లించే సామర్థ్యమే” అని వ్యాఖ్యానించారు.
తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. 2017లో కొలంబియా యూనివర్సిటీలో వరల్డ్ కాన్ఫరెన్స్‌కు చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా వెళ్లానని, అప్పుడే ఒక కోర్సుకు అడ్మిషన్ కూడా వచ్చిందని, కానీ ఫీజు 10–15 లక్షల వరకు ఉండటంతో చేయలేకపోయానని చెప్పారు. “డబ్బులు ఉంటే ఆక్స్ఫర్డ్ అయినా, హార్వర్డ్ అయినా తెచ్చుకోవచ్చు” అన్న వ్యాఖ్య ఈ చర్చకు మరింత బలం ఇచ్చింది.
ఈ నేపథ్యంలో కేటీఆర్‌తో పోలికను కూడా ప్రస్తావించారు. “కేటీఆర్ చేసినది ఒక సంవత్సరం పాటు చేసిన పూర్తి స్థాయి కోర్స్. రేవంత్ రెడ్డి చేసినది ఐదు రోజుల లీడర్షిప్ ట్రైనింగ్. రెండింటిని ఒకటిగా పోల్చలేం” అని స్పష్టం చేశారు. ఇంగ్లిష్ మాట్లాడటంపై పోలికలు చేయడం కంటే, నిజంగా చదవాలనుకుంటే వన్ ఇయర్ పీజీ కోర్సులు కూడా చేయవచ్చని అభిప్రాయపడ్డారు.
అయితే అసలు ప్రశ్న ఏంటంటే – ఈ సర్టిఫికేట్ వల్ల తెలంగాణ ప్రజలకు ఏం లాభం? అనే దానిపైనే. “ప్రజలకు ప్రత్యక్షంగా వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఇది పూర్తిగా వ్యక్తిగతంగా చెప్పుకోవడానికి, ఇమేజ్ బిల్డింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది” అని వ్యాఖ్యానించారు.
21వ శతాబ్దంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, గ్లోబల్ ఛాలెంజ్‌లపై చర్చ జరగడం మంచిదేనని, నేర్చుకోవడం ఎప్పుడూ మంచిదేనని అంగీకరిస్తూనే, ఇది కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మాత్రమేనని, అధికారులకు ఇచ్చే ఒక ప్రివిలేజ్ లాంటిదేనని అన్నారు.
మొత్తానికి రేవంత్ రెడ్డి లీడర్షిప్ సర్టిఫికేట్ ఒక అకాడమిక్ అచీవ్‌మెంట్ కంటే రాజకీయ చర్చలకే ఎక్కువ కారణమవుతోందన్నది విశ్లేషకుల అభిప్రాయం.

