తెలంగాణలో గురుకుల విద్యార్థుల దయనీయ పరిస్థితిపై మాజీ మంత్రి టి.హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురైన ఘటనపై స్పందించిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి హార్వార్డ్ యూనివర్సిటీకి వెళ్లి విదేశాల్లో ఫోటోలకు ఫోజులు ఇస్తుంటే, ఇక్కడ గురుకులాల్లో చదువుతున్న పేద విద్యార్థులు పాముకాట్లతో, కుక్కకాట్లతో ఆసుపత్రుల పాలవుతున్నారని హరీష్ రావు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు. ఇది ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు.
రేవంత్ రెడ్డి పాలనలో గురుకుల విద్యాలయాలు విద్యా కేంద్రాలుగా కాకుండా విషప్రాణులకు అవాసాలుగా మారాయని విమర్శించారు. హాస్టళ్లలో పరిశుభ్రత లేకపోవడం, పిచ్చి మొక్కలు తొలగించకపోవడం, చీకట్లో లైట్లు కూడా వేయని పరిస్థితి ఉందన్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల పాముకాట్లు, కుక్కకాట్లు సాధారణ ఘటనలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గురుకులాల్లో పిల్లలకు కడుపునిండా తిండి కూడా లభించడం లేదని హరీష్ రావు ఆరోపించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్క సంఘటనపై కూడా ప్రభుత్వం స్పష్టమైన నివేదిక ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక మంత్రి బయట తిండి తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందంటూ తప్పించుకుంటే, మరోవైపు రాజకీయ కారణాలు చూపిస్తూ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు.
“పిల్లల ప్రాణాలకు ఓట్లు లేవు కాబట్టే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది” అంటూ హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓట్లు ఉన్న వర్గాల సమస్యలైతే వెంటనే స్పందించేవారని, కానీ పేద విద్యార్థుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.
రూ.20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ రంగుల కలలు చూపిస్తున్న ప్రభుత్వం, కనీస వసతులు లేని గురుకులాలను గాలికి వదిలేయడం సరికాదన్నారు. బేసిక్ విద్య సరిగా లేని పరిస్థితుల్లో టెక్నాలజీ పేరుతో కొత్త పథకాలు ప్రకటించడం ప్రయోజనకరం కాదని వ్యాఖ్యానించారు.
వాస్తవంగా చూస్తే, గురుకుల విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, చదువుకునే వయసులో పిల్లలు ఫుడ్ పాయిజన్‌లు, పాముకాట్లు, అస్వచ్ఛత కారణంగా చిత్రహింసలు అనుభవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు పిల్లలను “చదువు ఎందుకు?” అనే స్థితికి తీసుకెళ్తున్నాయని, ఇది తెలంగాణ విద్యా వ్యవస్థకు అత్యంత ప్రమాదకర సంకేతమని హెచ్చరించారు.
ఈ అంశంపై ఒక్క మంత్రి కూడా బాధ్యతగా స్పందించకపోవడం, గంభీరంగా చర్చించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని హరీష్ రావు తేల్చిచెప్పారు.

