జగిత్యాల అభివృద్ధే లక్ష్యం: పార్టీ ఏదైనా ప్రభుత్వంతో కలిసి పని చేస్తా – ఎమ్మెల్యే స్పష్టం

జగిత్యాల పట్టణ అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని, పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వంతో కలిసి పని చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్‌తో కలిసి పనిచేసిన అనేక మందికి రావాల్సిన బిల్లులు, హక్కులు ఇప్పించానని, అవసరమైతే భవిష్యత్తులో కూడా ఎవరు సహకారం కోరినా వెనకాడనని ఆయన తెలిపారు.

రాజకీయాల్లో పార్టీ మారడం కొత్త కాదని పేర్కొన్న ఎమ్మెల్యే, పీవీ నరసింహారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి దేశవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, ఎన్‌సీపీ వంటి పార్టీల్లో నేతల విలీనాలు, మార్పులు రాజకీయ చరిత్రలో సహజమేనని అన్నారు. ఈ నేపథ్యంలో తనపై విమర్శలు చేయడం తగదని స్పష్టం చేశారు.

తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని, బీఆర్ఎస్ నుంచే గెలిచానని, అయినప్పటికీ జగిత్యాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. డిసెంబర్ 19న సీఎం కార్యాలయం నుంచి వచ్చిన లేఖ, ఆ తర్వాత విడుదలైన నిధులు తన ప్రయత్నాలకు నిదర్శనమని చెప్పారు. జూన్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం తనపై ఆధారాలు లేని ప్రచారం జరిగిందని, వివరణ ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎంను కలిసిన మరుసటి రోజే తన ఇంటి, ఆసుపత్రిపై దాడులు జరిగాయని, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కూడా వేశారని తెలిపారు. అయినప్పటికీ బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు రూ.5,000 జీతం నుంచి కట్ అయినా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెప్పారు. తాను పార్టీపై కానీ, అధిష్టానంపై కానీ ఎప్పుడూ బహిరంగ విమర్శలు చేయలేదని స్పష్టం చేశారు.

ఎన్ని విమర్శలు వచ్చినా తాను వెనకడుగు వేయబోనని, ఎన్నికల లాభాల కోసం కాకుండా జగిత్యాల అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేసే అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. జగిత్యాల పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *