నల్గొండ జిల్లా హాలియా–నందికొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, పోలీసు అధికారుల సహకారంతో బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ నేత జానారెడ్డి, ఆయన కుమారులు జైవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి డబ్బుల మూటలతో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రలోభ పెట్టడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో డ్యూటీ లేకున్నా డీఎస్పీ సైదిరెడ్డి అర్ధరాత్రి బీఆర్ఎస్ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని, పోలీసుల అధికార బలాన్ని దుర్వినియోగం చేస్తున్నారని నోముల భగత్ విమర్శించారు. ఒక పోలీస్ అధికారిలా కాకుండా రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ బీ-ఫామ్ ఇచ్చిన అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని డబ్బులు చూపించి నామినేషన్లు విత్‌డ్రా చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఒక మహిళా అభ్యర్థిని బెదిరించి, ఆమె భర్త కనిపించట్లేదని బలవంతంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించిన ఘటన అత్యంత దారుణమని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్ తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.
డబ్బుల బ్యాగులతో నల్లకార్లలో వచ్చి ఓట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినా, ఘర్షణలు జరగకుండా శాంతియుతంగా వారిని బయటికి పంపామని చెప్పారు. అయినప్పటికీ మళ్లీ పోలీసులను వెంటబెట్టుకొని వచ్చి ఒత్తిళ్లు కొనసాగించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని అన్నారు.
సర్పంచ్ ఎన్నికల సమయంలోనూ ఇదే తరహాలో భారీగా డబ్బులు పంపిణీ చేశారని, ఒక్కో గ్రామానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే ఆరోపణలు ఉన్నాయని నోముల భగత్ గుర్తు చేశారు. మహిళలకు ఇవ్వాల్సిన ₹2,500 హామీని కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలలుగా అమలు చేయలేదని, అలాంటప్పుడు ఓటుకి ₹10,000 ఎందుకు ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
ఈ అక్రమ రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని, ఎంత డబ్బులు పంచినా ప్రజలు బీఆర్ఎస్, కేసీఆర్ వైపే నిలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల పేరుతో జరుగుతున్న బెదిరింపులు, ఓట్ల కొనుగోళ్లు ఎన్నికలనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని అన్నారు. ప్రజలకు స్వేచ్ఛగా తమ నాయకులను ఎన్నుకునే హక్కు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు.

