పార్టీ ఫిరాయింపుల కేసులో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని స్పీకర్ ఆదేశించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పీకర్ స్వయంగా విచారణ జరపనున్నారు.
ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్, గూడె మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఆర్కేపూడి గాంధీ లపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. తాము బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని వారు సమర్పించిన అఫిడవిట్లను పరిగణనలోకి తీసుకొని స్పీకర్ వారికి క్లీన్ షీట్ ఇచ్చారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంలో మాత్రం స్పీకర్ తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై దాఖలైన పిటిషన్ విచారణ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరిపై నేడు జరగనున్న విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వరంగల్ ఎంపీగా గెలుపొందడం ఈ కేసుకు మరింత రాజకీయ ప్రాధాన్యతను తెచ్చింది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది హాట్‌టాపిక్‌గా మారింది.
అయితే ఈ మొత్తం వ్యవహారం ఒక ‘డైలీ సీరియల్’లా సాగదీస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ మార్పుకు సంబంధించి కీలక ఆధారాలు ఉన్నప్పటికీ తుది నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే అనర్హత వేటు పడాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసు, ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య పరస్పర ఆరోపణలతో ఈ వ్యవహారం కొనసాగుతుండగా, చివరికి స్పీకర్ నిర్ణయమే కీలకంగా మారనుంది.
ఇదిలా ఉండగా, విచారణ నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని, ఈ అంశంలో స్పష్టత రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

