అస్తం, సుత్తి–కొడవలి–నక్షత్రం గుర్తులకు ఓటేయండిపేదల ప్రభుత్వాన్ని మరింత బలపర్చండి: మంత్రి పిలుపు

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ప్రజలకు ఓటింగ్‌పై స్పష్టమైన విజ్ఞప్తి చేశారు. 23వ పరిధిలోని మూడు డివిజన్లలో ‘అస్తం’ గుర్తుకు, 21వ డివిజన్‌లో సీపీఎం పార్టీ గుర్తైన ‘సుత్తి–కొడవలి–నక్షత్రం’కు అత్యధిక ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

రెండు సంవత్సరాల క్రితం ప్రజల కష్టఫలితంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి అండగా నిలిచే అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, పాత కార్డుల్లో పేర్ల చేర్పు వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి పేదింటికి సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. రైతుల కోసం తొమ్మిది నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 26.5 లక్షల మందికి రూ.21 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేసినట్లు తెలిపారు. వరి సాగు చేసిన రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్, రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.12 వేల ఆర్థిక సాయం అందుతున్నట్లు వివరించారు.

గత ప్రభుత్వం పేదవాడికి ఇల్లు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించిన ఆయన, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. కొత్తగూడం నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు కాగా, సుజాత నగర్‌కు కూడా ఇళ్లు వచ్చినట్లు చెప్పారు. ఏప్రిల్‌లో రెండో విడతతో పాటు మూడో, నాలుగో విడతలుగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇల్లు ఇచ్చి ఆగిపోయే ప్రభుత్వం కాదని, లంచం లేకుండా ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు కూడా ప్రభుత్వ భూముల్లో స్థలాలు కేటాయించి, ఐదు లక్షల రూపాయలతో ఇళ్లు నిర్మించే బాధ్యత తానే తీసుకుంటానని స్పష్టం చేశారు.

చివరగా, పదేళ్ల పాలన చేసిన వారు ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇస్తారని విమర్శించారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే అధికారంలో ఉన్నవారిని గెలిపించాల్సిందేనని పేర్కొంటూ, తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *