ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండని నేతగా బిఆర్ఎస్లో మొదట వినిపించే పేరు జీవన్ రెడ్డి అని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచార చివరి రోజున ఆర్మూర్‌లో ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన, రానున్న ప్రభుత్వం ఖచ్చితంగా బిఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ మళ్లీ పూర్వ వైభవాన్ని సాధిస్తుందని, 2001లో తెలంగాణ ఉద్యమానికి తొలి మద్దతు లభించిన జిల్లా ఇదేనని గుర్తు చేశారు. అప్పట్లో కేసీఆర్ నాయకత్వంలో జెడ్పీ చైర్మన్ పదవి నుంచి మొదలైన రాజకీయ బలం మళ్లీ పుంజుకుంటోందన్నారు. బోధన్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్‌లలో గులాబీ జెండా మళ్లీ ఎగిరే పరిస్థితి వచ్చిందని చెప్పారు.
కేసీఆర్ జాతిపిత – అధికారికంగా ప్రకటిస్తా’
కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా అధికారికంగా ప్రకటించడమే తన జీవిత లక్ష్యమని జీవన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి జీవోగా ‘తెలంగాణ జాతిపిత – కేసీఆర్’ అని తానే సంతకం చేసి విడుదల చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆర్ేనని, నాలుగున్నర కోట్ల ప్రజల గుండెల్లో ఆయన ఉన్నారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ లేకపోతే నేడు తెలంగాణ అనే పేరు, తెలంగాణ మీడియా, తెలంగాణ రాజకీయాలు ఉండేవి కావని పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన త్యాగాలు, ఉద్యమం, ఆమరణ దీక్షలను గుర్తు చేస్తూ, ఆయనను జాతిపిత అనడం అహంకారం కాదని, చరిత్రకు ఇచ్చే గౌరవమని అన్నారు.
కాంగ్రెస్ హామీలపై ఘాటు విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఒక్క హామీ కూడా సరిగా అమలు కాలేదని జీవన్ రెడ్డి ఆరోపించారు. మహిళలకు హామీ ఇచ్చిన రూ.4,000, రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా, ఆడబిడ్డలకు స్కూటీలు – ఏదీ అమలు కాలేదన్నారు. దీంతో ప్రజలకు కాంగ్రెస్‌పై నమ్మకం పూర్తిగా పోయిందని చెప్పారు.
నిజామాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా, ఏ మున్సిపాలిటీకి ఎంత నిధులు ఇచ్చారో చెప్పలేకపోయారని విమర్శించారు. పట్టణాభివృద్ధిపై స్పష్టత లేకుండా మాట్లాడటం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు.
అభివృద్ధిపై తనదే బాధ్యత
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆర్మూర్ నియోజకవర్గంలో కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని జీవన్ రెడ్డి వివరించారు. సిద్ధులగుట్ట ఆసుపత్రి, డయాలిసిస్ సెంటర్లు, 30 వేల మందికి డెలివరీ సేవలు, సీఎం రిఫరల్స్, బైపాస్ రోడ్లు, వంద కోట్లకు పైగా రోడ్లు, ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు అందించామని పేర్కొన్నారు.
తనపై అవినీతి ఆరోపణలు చేస్తే, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తాను ఒక్క రూపాయి కూడా దోచుకోలేదని, దోచుకున్నానని రుజువు చేస్తే బాండ్ పేపర్‌పై రాసి ఇవ్వడానికి సిద్ధమన్నారు.
పోలీస్ వ్యవస్థపై, కాంగ్రెస్–బీజేపీపై ఆరోపణలు
ప్రస్తుత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుతోందని జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఇంటికి నోటీసులు ఇచ్చిన తీరును అప్రజాస్వామికంగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని అవమానించడం ప్రజల మనోభావాలకు దెబ్బతీయడమేనన్నారు.
బీజేపీ–కాంగ్రెస్ మధ్య లోపలి ఒప్పందాలు ఉన్నాయని, కీలక కేసుల్లో ఆధారాలు నాశనం చేసే ప్రయత్నాలు జరిగాయనే అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన తీర్పు ఇస్తారని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపు ఖాయం
నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, కాంగ్రెస్‌కు ఇచ్చిన అవకాశం వృథా అయిందని తేల్చి చెప్పారన్నారు. ఆర్మూర్‌లో వన్‌సైడ్ ఫైట్ జరుగుతోందని, బిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
ఇంటర్వ్యూ ముగింపులో “కేసీఆర్ జోలికి వస్తే వదిలిపెట్టం” అంటూ తీవ్ర హెచ్చరికలు చేస్తూ, తెలంగాణ ప్రజలు మళ్లీ గులాబీ జెండాను అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని జీవన్ రెడ్డి అన్నారు.

