మూసి పునర్జీవానికి కీలక ముందడుగు… 50 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్, టిడిఆర్ పరిహారంపై సందేహాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసి పునర్జీవ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. మూసి నది పునరుద్ధరణ, పరివాహక ప్రాంతాల అభివృద్ధి కోసం 50 ఎకరాల భూసేకరణ చేపట్టాలని మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ బుధవారం జారీ అయింది.

హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ బాపుఘాట్ వరకు 9.2 కిలోమీటర్లు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూములను సేకరించనున్నారు. మొత్తం 21 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టే ప్రణాళిక రూపొందించారు. నదికి ఇరువైపులా 50 మీటర్ల మేర బఫర్ జోన్‌గా ప్రకటించి, అర్బన్ ల్యాండ్‌స్కేపింగ్, పర్యాటక కేంద్రాలు, ఉద్యానవనాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజగిరి జిల్లాల పరిధిలో గండిపేట నుంచి గౌరెల్లి వరకు సుమారు 55 కిలోమీటర్ల మేర మూసి నది ప్రవహిస్తుంది. ఈ మొత్తం మార్గంలో నది ఇరువైపుల 50 మీటర్ల బఫర్ జోన్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

భూసేకరణ తొలి విడతలో గోల్కొండ మండలంలోని ఇబ్రంబాగ్, కిలా మహమ్మద్ నగర్, రాజేంద్రనగర్ మండలంలోని హైదర్గూడ, బద్వేల్, ఉప్పర్పల్లి, గండిపేట్ మండలంలోని దర్గా, కిస్మత్పుర, నర్సింగి, మంచిరేవుల, గంధంగూడ, బండ్లగూడ తదితర గ్రామాల పరిధిలో భూములు సేకరించనున్నారు. సంబంధిత సర్వే నంబర్ల జాబితాను అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

భూములు కోల్పోయే యజమానులకు టిడిఆర్ (Transfer of Development Rights) రూపంలో నష్టపరిహారం చెల్లించనున్నారు. మార్కెట్ విలువ ఆధారంగా అభివృద్ధి హక్కులను బదిలీ చేసే విధంగా పరిహారం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

అయితే టిడిఆర్ విధానంపై భూయజమానుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరిహారం ఎప్పుడు అందుతుంది, భూమి బదులుగా మరో చోట భూమి కేటాయిస్తారా, లేక అభివృద్ధి హక్కుల రూపంలో మాత్రమే ఇస్తారా అన్న విషయాల్లో స్పష్టత కావాలని కోరుతున్నారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో టిడిఆర్ ప్రక్రియపై ప్రజలు ఆమోదం తెలపకపోవడం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది.

ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం చెరువులు, నదుల ఎఫ్టీఎల్ పరిధిలోని భూములకు 200% టిడిఆర్, బఫర్ జోన్ భూములకు 300%, ప్రజా ప్రయోజనాల ప్రాజెక్టులకు ఇచ్చే భూములకు 400% వరకు టిడిఆర్ పరిహారం ఇవ్వనున్నారు.

భూసేకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో త్వరలోనే క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మూసి నది శుద్ధీకరణతో పాటు నగర అభివృద్ధికి ఇది కీలక దశగా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *