గత పాలకులు ప్రజా తీర్పును ఒప్పుకోవడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము పాలకులు కాదని ప్రజాసేవకులమని అధికారంలోకి వచ్చినప్పుడే స్పష్టం చేశామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచినా ఉప్పొంగకుండా, ఓడినా కుంగిపోకుండా ప్రజల కోసం పని చేస్తామని అన్నారు.
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్లోని బంజారా హిల్స్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. తాండాలకు బీటీ రోడ్లు, పంచాయతీ భవనాలు, పాఠశాలలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నల్లమల ఫారెస్ట్లో 20 ఎకరాల్లో ఆలయం నిర్మించి వచ్చే ఏడాది అక్కడే జయంతి వేడుకలు జరుపుకుందామని ప్రకటించారు.
ఇక మరోవైపు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో శాఖల వారీ సమీక్షలు ప్రారంభమవుతున్నాయి. వచ్చే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధుల కేటాయింపులు, ఆదాయ వనరులు, వ్యయ ప్రణాళికలపై సమగ్ర చర్చలు జరగనున్నాయి.
వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం, రైతు సంక్షేమం, ఆరోగ్య హామీల అమలుకు భారీ నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రతి శాఖ గత ఏడాది నిధుల వినియోగం, ప్రస్తుత అవసరాలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆదాయం, కేంద్ర గ్రాంట్లు, రుణాల లభ్యతను పరిగణనలోకి తీసుకొని వాస్తవిక బడ్జెట్ రూపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఆరు గ్యారెంటీల అమలు కోసం అవసరమైన నిధుల సమీకరణపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించనుంది ప్రభుత్వం. అవసరమైతే రుణాల ద్వారా నిధులు సమకూర్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రాంతీయ అసమానతలు తగ్గేలా, అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పథకాల ప్రయోజనం అందేలా ఆర్థిక క్రమశిక్షణతో బడ్జెట్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

