ఏప్రిల్ 22న ఆర్టీసీ సమ్మె హెచ్చరిక… ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన జేఎస్సీ నాయకులు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు మరోసారి ఉధృతమవుతున్నాయి. టీఎస్ఆర్టీసీ జేఎస్సీ సభ్యులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏప్రిల్ 22న రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు.

జేఎస్సీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ జై రాఘవులు మాట్లాడుతూ, ఫిబ్రవరి 23న ‘చలో సెక్రటేరియట్’కు అనుమతి నిరాకరించడంతో దాదాపు 20,000 మంది కార్మికులతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. అనంతరం మార్చి 13న 32 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చామని తెలిపారు.

ఈ డిమాండ్లలో ముఖ్యంగా ఆరు అంశాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయని, వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. లేబర్ కమిషనర్ వద్ద జరిగిన చర్చలకు మేనేజ్‌మెంట్ హాజరుకాలేదని, దీంతో చట్టబద్ధంగా సమ్మెకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.

ఇక ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కూడా జేఎస్సీ ఆందోళన వ్యక్తం చేసింది. పర్యావరణ పరిరక్షణకు తమకు వ్యతిరేకత లేదని, కానీ ప్రైవేట్ సంస్థలకు భారీ సబ్సిడీలు ఇవ్వడం వల్ల ఆర్టీసీకి నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. ఒకవైపు వేలాది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, మరోవైపు ఆర్టీసీకి రావాల్సిన లాభాలు ప్రైవేట్ సంస్థలకు మళ్లుతున్నాయని అన్నారు.

హైదరాబాద్‌లోనే సుమారు 8,000 మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉందని జేఎస్సీ హెచ్చరించింది. ప్రభుత్వం స్వయంగా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అందించాలనే డిమాండ్ చేసింది.

అదేవిధంగా, ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బకాయిలు, పీఆర్సీ, పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి నెల ఇవ్వాల్సిన నిధుల్లో కోతలు పెట్టడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ప్రభుత్వం చర్చలకు ముందుకు రావాలని, లేకపోతే ఏప్రిల్ 22న అర్ధరాత్రి నుంచి సమ్మె 100% అమలు చేస్తామని స్పష్టం చేశారు. బస్సులు పూర్తిగా నిలిపివేస్తామని, సమ్మె విజయవంతం అవుతుందని జేఎస్సీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా ఉంటే గత ప్రభుత్వాల మాదిరిగానే ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వెంటనే చర్చలు ప్రారంభించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *