హైదరాబాద్ సెక్రటేరియట్ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తే ఘటన వెలుగులోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిపిస్తానంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసిన ఓ నకిలీ కానిస్టేబుల్‌ను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ రాష్ట్రంలోని ఒంగోలుకు చెందిన రవి అలియాస్ నిఖిల్ యాదవ్ పోలీస్ యూనిఫాం ధరించి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన నిఖిల్ యాదవ్, సెక్రటేరియట్ గేట్ వద్ద ఉన్న భద్రతా సిబ్బందిని ఒప్పించి లోపలికి వెళ్లినట్టు సమాచారం. అక్కడ కుటుంబంతో ఫోటోలు దిగడమే కాకుండా “సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి” అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. “ఏ పార్టీ వాళ్లైనా సరే, నాకు మెసేజ్ చేస్తే సీఎం ను కలిపిస్తా” అని వీడియోలో చెప్పడం వైరల్‌గా మారింది.
ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విషయం తెలిసిన వెంటనే నిఖిల్ వీడియోను డిలీట్ చేసి పరారయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ, టెక్నికల్ ఆధారాలతో పోలీసులు అతడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతనిపై చీటింగ్, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విషయం తెలిసిన వెంటనే నిఖిల్ వీడియోను డిలీట్ చేసి పరారయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ, టెక్నికల్ ఆధారాలతో పోలీసులు అతడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతనిపై చీటింగ్, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
అయితే ఈ ఘటనతో సెక్రటేరియట్ భద్రతా వ్యవస్థపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ ప్రజలు సెక్రటేరియట్‌లోకి వెళ్లాలంటే ఆధార్, పాన్, ఐడీ కార్డులు చెక్ చేస్తూ కఠిన తనిఖీలు నిర్వహిస్తారు. అలాంటిది పూర్తి పోలీస్ యూనిఫార్మ్‌లో వచ్చిన వ్యక్తిని కనీసం అతని ఐడీ కార్డు, బ్యాచ్ నంబర్, స్టేషన్ వివరాలు అడగకుండా లోపలికి ఎలా అనుమతించారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
విమర్శకులు మాట్లాడుతూ “ఇది పూర్తిగా సెక్రటేరియట్ సెక్యూరిటీ వైఫల్యం” అని ఆరోపిస్తున్నారు. “అతడు రీల్స్ కోసం వెళ్లాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ దురుద్దేశంతో వచ్చిన వ్యక్తి అయితే పరిస్థితి ఎలా ఉండేది?” అంటూ ప్రశ్నిస్తున్నారు.
పోలీసుల విచారణలో నిఖిల్ యాదవ్ గతంలో ఉప్పల్ స్టేడియం వద్ద కూడా పోలీస్ వేషధారణలో వీడియోలు చేసినట్టు తెలిసింది. ఐపీఎల్ టికెట్లు ఇప్పిస్తానంటూ కూడా రీల్స్ చేసినట్టు సమాచారం. దీంతో అతడు మరెవరినైనా మోసం చేశాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన తర్వాత సెక్రటేరియట్ భద్రతా విధానాలపై ప్రభుత్వం సమీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

