నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ.. నేను మీ పవన్, నేను కారుణ్య. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్‌గా మారింది టీవీకే పార్టీ. తలపతి విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కళగం పార్టీ ఈ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో దూసుకుపోతుండటంతో దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
ఇప్పటివరకు తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్యే ప్రధాన పోటీ కనిపించేది. ఐదు సంవత్సరాలు ఒక పార్టీ అధికారంలోకి వస్తే తర్వాత మరో పార్టీ అధికారంలోకి రావడం అక్కడ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే విషయం. కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయినట్టుగా కనిపిస్తోంది. టీవీకే పార్టీ ఒక్కసారిగా ప్రధాన రాజకీయ శక్తిగా ఎదగడం తమిళ రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.
ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ప్రకారం టీవీకే పార్టీ 109 నుంచి 112 స్థానాల మధ్య ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు సమాచారం. మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా మ్యాజిక్ ఫిగర్ 116. దీంతో విజయ్ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతుందా? విజయ్ నిజంగానే తమిళనాడు సీఎం కాబోతున్నారా? అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
ఇప్పటికే విజయ్ నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకునే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. టీవీకే పార్టీ కార్యాలయాల వద్ద కూడా సంబరాలు మొదలైన పరిస్థితి కనిపిస్తోంది.
ఈ సందర్భంగా చర్చలో పాల్గొన్న కారుణ్య మాట్లాడుతూ.. “డీఎంకే వంటి పెద్ద పార్టీని దాటి టీవీకే ముందుకు రావడం నిజంగా విశేషం. యూత్ మాత్రమే కాదు పాత అభిమానులు కూడా విజయ్‌కు మద్దతుగా నిలిచారు. ప్రజలు ఇప్పటికే విజయ్ను గెలిపించేశారనే భావన కనిపిస్తోంది” అని అన్నారు.
అయితే అసలు టీవీకే పార్టీకి ఈ స్థాయిలో స్పందన రావడానికి కారణాలు ఏమిటి? అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది.
మొదటిగా చెప్పుకోవాల్సింది విజయ్ ఫ్యాన్ బేస్. తమిళనాడులో విజయ్‌కు ఉన్న అభిమాన గణం చాలా పెద్దది. గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు ఆయన ఫ్యాన్ క్లబ్బులు బలంగా పనిచేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇదే బూత్ లెవెల్ నెట్‌వర్క్‌గా మారి పార్టీకి భారీగా ఉపయోగపడినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక మరో ముఖ్య కారణం డీఎంకే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అని కూడా చెబుతున్నారు. గత ఐదు సంవత్సరాల పాలనలో ప్రజల్లో కొంత అసంతృప్తి పెరిగిందనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా యువత కొత్త ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో విజయ్ రాజకీయాల్లోకి రావడం టీవీకే పార్టీకి ప్లస్ అయ్యింది.
“స్టాలిన్ పాలన చూసిన ప్రజలు ఇప్పుడు ఒకసారి విజయ్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కొత్త నాయకత్వం ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి కూడా ప్రజల్లో కనిపిస్తోంది” అని చర్చలో పేర్కొన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో కూడా కొంతమంది టీవీకే పార్టీని పోల్చుతున్నారు. కొత్త పార్టీగా జనసేన ఎదుర్కొన్న సవాళ్లు టీవీకేకూ వస్తాయా? అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే అక్కడ ప్రధాన తేడా ఏమిటంటే.. విజయ్ ఫ్యాన్ బేస్ ఇప్పటికే బూత్ స్థాయిలో బలమైన వ్యవస్థగా మారిపోయిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
జనసేన ప్రారంభ దశలో బూత్ లెవెల్ కార్యకర్తల కొరత ఎదుర్కొంది. కానీ టీవీకే విషయంలో మాత్రం విజయ్ అభిమాన సంఘాలే కార్యకర్తలుగా మారడం పార్టీకి పెద్ద బలంగా మారింది. గ్రామ స్థాయి వరకు పార్టీ తరఫున పని చేసే వ్యవస్థ ఇప్పటికే సిద్ధంగా ఉండటంతో ఎన్నికల నిర్వహణలో టీవీకే బలంగా కనిపించింది
ఇక విజయ్ వ్యక్తిగత ఇమేజ్ కూడా పార్టీకి ప్లస్ అయిందని చెబుతున్నారు. అవినీతి ఆరోపణలు లేకపోవడం, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లడం, సినిమాల్ని పక్కన పెట్టి పూర్తిస్థాయిలో రాజకీయాలపై ఫోకస్ చేయడం వంటి అంశాలు ప్రజలను ఆకర్షించాయి.
అయితే విజయ్ రాజకీయ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. పార్టీ ప్రారంభ సభలో జరిగిన అవాంఛనీయ ఘటనలు, వ్యక్తిగత జీవితంపై వచ్చిన వివాదాలు, భార్యతో విడాకుల ప్రచారం వంటి అంశాలు టీవీకే పార్టీకి మైనస్ అవుతాయని ప్రత్యర్థి పార్టీలు విమర్శించాయి. కానీ ఆ నెగెటివిటీని విజయ్ తన ప్రచారంతో అధిగమించినట్టు కనిపిస్తోంది.
ఇప్పుడు తమిళనాడులో ఒక్కటే చర్చ.. “విజయ్ నిజంగానే సీఎం అవుతారా?” అన్నది. మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా టీవీకే పార్టీ నిలవడంతో పూర్తి ఫలితాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.
ఒకవేళ టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటితే తమిళనాడు రాజకీయాల్లో ఇది చారిత్రాత్మక మలుపుగా మారే అవకాశం ఉంది. లేదంటే హంగ్ పరిస్థితుల్లో డీఎంకే లేదా అన్నాడీఎంకే మద్దతు అవసరం అయ్యే పరిస్థితి కూడా రావచ్చు.
ఏదేమైనా తమిళనాడులో ఈ ఎన్నికలు సంప్రదాయ రాజకీయాలకు సవాల్ విసిరినట్టుగా కనిపిస్తున్నాయి. ప్రజలు కొత్త ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారా? యువత నిజంగానే విజయ్ వెనుక నిలిచిందా? అన్న ప్రశ్నలకు ఈ ఫలితాలు సమాధానం చెప్పబోతున్నాయి.
ఇక పూర్తి ఫలితాలు వెలువడే వరకు తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగనుంది.

