ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులు మరింత తీవ్రమవుతున్నాయి. నెల రోజులుగా ధాన్యం తీసుకొచ్చి పెట్టినా కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతూ పెట్రోల్ ఖర్చులు, భోజన ఖర్చులు భరించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
“30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ కాంటాలు వేయడం లేదు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే కూర్చోవాల్సి వస్తోంది. టిఫిన్, నీళ్లు కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. వానలు వస్తే మా ధాన్యం పరిస్థితి ఏంటి?” అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు చెబుతున్న ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కూడా లేవట. మంచినీటి సదుపాయం లేదని, అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. “చైర్మన్ సరిగా లేడు. అధికారులు ఎవరూ రావడం లేదు. మాకు న్యాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు” అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు భరోసా, రైతు సంక్షేమం పేరుతో హామీలు ఇచ్చినా వాటి అమలు కనిపించడం లేదని రైతులు అంటున్నారు. “ఐదు ఎకరాలు ఉన్నాయి. రైతు భరోసా ఇస్తామన్నారు కానీ ఏమీ రాలేదు. ఎకరానికి డబ్బులు వేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు పడలేదు” అని రైతులు తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రైతులకు అవసరమైన సౌకర్యాలు సమయానికి అందేవని, ఇప్పుడు యూరియా కోసం కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు రైతులు పేర్కొన్నారు. “ముందు ఫోన్ చేస్తే సరిపోతుండేది. ఇప్పుడు రైతులే వచ్చి రోజులు గడపాల్సి వస్తోంది” అని అన్నారు.
ఇటీవల రైతులు ధరణా చేపట్టినా అధికారులు స్పందించలేదని, పోలీసులు మాత్రమే వచ్చి వారిని అక్కడి నుంచి పంపించారని రైతులు ఆరోపించారు. “మాకు గతి లేక ధరణా చేశాం. కానీ అధికారులు ఎవరూ రాలేదు. పోలీసులు వచ్చి బస్సులు ఆపొద్దని చెప్పి తీసుకెళ్లారు” అని రైతులు చెప్పారు.
ధాన్యం కొనుగోలు ఆలస్యం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

