తెలంగాణలో రైతుల అసంతృప్తి రోజు రోజుకూ పెరుగుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో భారీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలు మరింత పెరిగాయని గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రైతు బంధు, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు, ఎరువుల కొరత వంటి అంశాలపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“మార్పు వస్తుందని నమ్మి ఓటేశాం.. కానీ ఇప్పుడు మోసపోయామనే భావన కలుగుతోంది” అంటూ పలువురు రైతులు తమ బాధను వెల్లగక్కుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయని, కనీసం రైతు బంధు డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు.
ఎన్నికల ముందు రైతులకు ఎకరానికి ₹15,000 ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఉన్న పథకాలే సక్రమంగా అమలు కావడం లేదని మండిపడుతున్నారు. రైతు భరోసా పేరుతో డబ్బులు విడుదల చేశామని ప్రభుత్వం చెబుతున్నా, నిజంగా ఎంతమందికి చేరాయో ప్రభుత్వానికే తెలియదని సీఎం వ్యాఖ్యలపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రైతుల ప్రధాన ఆవేదన ధాన్యం కొనుగోలుపైనే ఉంది. సరైన సమయంలో వడ్లు కొనకపోవడం వల్ల కల్లాల వద్దే ధాన్యం పేరుకుపోయిందని, రైతులు ఎండలో పడిగాపులు కాస్తున్నారని చెబుతున్నారు. బోనస్ ఇస్తామని చెప్పినా అది కేవలం ప్రకటనలకే పరిమితమైందని విమర్శిస్తున్నారు.
ఇక ఎరువుల సమస్య మరింత దారుణంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని, కొన్ని చోట్ల చెప్పులు పెట్టి క్యూ నిలుపుకుని రాత్రంతా వేచిచూసే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. గతంలో ఎలాంటి కొరత లేకుండా ఎరువులు అందుబాటులో ఉండేవని, ఇప్పుడు ఆధార్ కార్డు చూపించి పరిమితి మేరకే ఇస్తున్నారని అంటున్నారు.
మరోవైపు కళ్యాణ లక్ష్మి పథకం, తులం బంగారం వంటి హామీల అమలుపై కూడా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. పెళ్లయి నెలలు గడిచినా డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు చాలానే ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు.
రైతుల అభిప్రాయం ప్రకారం, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి సంబంధించిన సేవలు సమయానికి అందేవని, రైతు బంధు, ఎరువులు, కొనుగోలు కేంద్రాలు వంటి అంశాల్లో స్పష్టత ఉండేదని అంటున్నారు. ఇప్పుడు మాత్రం పరిపాలనలో గందరగోళం కనిపిస్తోందని విమర్శిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, ఎన్నికల హామీల అమలులో విఫలమైతే భవిష్యత్తులో రాజకీయంగా భారీ నష్టం తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైతులను రాజులుగా చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందనే భావన బలపడుతోంది.
“మార్పు కోసం ఓటేశాం.. కానీ ఇప్పుడు మళ్లీ పాత పాలన గుర్తుకొస్తోంది” అనే మాట ప్రస్తుతం గ్రామాల్లో బలంగా వినిపిస్తోంది.

