మహిళలకు భద్రత ఎక్కడ సార్?”.. సీఎం స్పందన కార్యక్రమంపై మహిళ ఆవేదన

ఇటీవల నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మహిళల భద్రత, మహిళా సాధికారతపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఓ మహిళ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే వారికి భద్రత, స్వేచ్ఛ, ప్రోత్సాహం అవసరమని సీఎం చెప్పిన మాటలు తనకు ఎంతో నచ్చాయని ఆమె పేర్కొన్నారు. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను సామాజిక బాధ్యతతో అక్రమ ప్రకటన బోర్డులు, అనధికారిక హోర్డింగ్స్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. ఆ ఫిర్యాదు వల్ల రాజకీయ సంబంధాలు ఉన్న కొందరు వ్యక్తులకు నష్టం జరిగిందని, అప్పటి నుంచి తనపై మానసిక వేధింపులు ప్రారంభమయ్యాయని ఆరోపించారు.

తన గురించి వాట్సాప్ గ్రూపుల్లో ట్రోలింగ్ చేయడం, ఇతర వ్యాపార వర్గాల దగ్గర తప్పుడు ప్రచారం చేయడం, నిరాధార ఆరోపణలు చేయడం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. తాను ప్రశ్నించగా “మా అన్న ఎమ్మెల్సీ ఉన్నాడు, నీ సంగతి చూస్తాం” అంటూ బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు.

ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనను మీడియా కూడా ప్రచురించిందని, దాంతో సంబంధిత రాజకీయ నేత ఇబ్బంది పడినట్లు చెబుతూ తనను సారీ చెప్పాలని మధ్యవర్తుల ద్వారా ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే క్షమాపణ చెప్పడానికి నిరాకరించానని చెప్పారు.

తర్వాత తనపై తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. నిజాలు మాట్లాడితే దొంగ కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. మహిళలను ప్రోత్సహించాలనే మాటలు చెప్పడం సరిపోదని, నిజంగా మహిళల భద్రత కోసం చర్యలు ఉండాలని అన్నారు.

అక్రమంగా వ్యాపారం చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవకాశాలు లభిస్తున్నాయని, కానీ చట్టబద్ధంగా వ్యాపారం చేయాలని కోరితే మాత్రం పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టాక్స్ చెల్లించి చట్టబద్ధంగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.

చివరగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన ఆమె, “మీరు చెప్పిన మాటలు చాలా గొప్పగా ఉన్నాయి సార్, కానీ బయట పరిస్థితులు అలా లేవు. మీ పార్టీ పేర్లు చెప్పి వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి” అంటూ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *