ఇందిరా పార్క్ వేదికగా జరిగిన భారీ నిరసన కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) నాయకులు, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత మాజీ సీఎం K. Chandrashekar Raoదేనని, కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులను మోసం చేసిందని ఆరోపించారు.
నాయకులు మాట్లాడుతూ గతంలో తండాలకు గ్రామ పంచాయతీ హోదా కోసం అనేక పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. “హమారా తండా – హమారా రాజ్” నినాదంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేశామని, కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే 3146 తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించి, తండాల్లోనే స్థానికులను సర్పంచులుగా నిలబెట్టిందని తెలిపారు.
చేవెళ్ల డిక్లరేషన్ అమలు కాలేదు”
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై కూడా నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు. “10వ తరగతి పాస్ అయితే ₹10వేలు, ఇంటర్ పాస్ అయితే ₹15వేలు, డిగ్రీకి ₹25వేలు, పీజీకి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు” అంటూ మండిపడ్డారు.
అలాగే కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసిందని, ప్రస్తుతం అవి సక్రమంగా అమలవడం లేదని ఆరోపించారు. గిరిజన యువతకు ఉద్యోగాలు, బ్యాక్‌లాగ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు.
భూముల స్వాధీనంపై ఆగ్రహం
రాష్ట్రంలో పరిశ్రమల పేరిట ఎస్సీ, ఎస్టీ భూములను భారీ స్థాయిలో స్వాధీనం చేసుకుంటున్నారని నాయకులు ఆరోపించారు. ముఖ్యంగా తండాల్లో నివసించే గిరిజనుల ఇండ్లను కూల్చివేసి, భూములను లాక్కుంటున్నారని అన్నారు. “భూములు గుంజుకుంటే ప్రశ్నించిన గిరిజన మహిళలపై కేసులు పెట్టి, అరెస్టులు చేశారు” అంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కొడంగల్‌లో లంబాడీల ఓట్లతో గెలిచిన నాయకత్వం ఇప్పుడు అదే లంబాడీలను మర్చిపోయిందని విమర్శించారు. “మా ఓట్లతో గెలిచి, ఇప్పుడు మా చేతులకు బేడీలు వేస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఖర్గే స్పందించాలి”
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు Mallikarjun Kharge స్వయంగా ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను అమలు చేయించాలని డిమాండ్ చేశారు. “ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేసి హామీలు అమలు చేయించండి. లేదంటే ఢిల్లీలో మీ ఇంటి ముందు ధర్నా చేస్తాం” అంటూ హెచ్చరించారు.
లంబాడీలు ఓర్పుతో రెండున్నరేళ్లు ఎదురుచూశారని, కానీ హామీలు అమలు కాకపోవడంతో మళ్లీ ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందన్నారు. “మాట ఇస్తే నమ్ముతాం… మోసం చేస్తే ఎంతకైనా తెగిస్తాం” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

