మహిళలకు ఉచిత పథకాల కంటే శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రతి గ్రామంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మదర్ ఫౌండేషన్ ప్రతినిధులు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను కోరారు. మదర్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ ప్రతినిధులు మహిళల ఆర్థిక సాధికారతకు సంబంధించిన పలు సూచనలు చేశారు.
మదర్ ఫౌండేషన్ స్థాపకురాలు మాట్లాడుతూ, తాము రాజకీయాల కోసం ఈ సంస్థను ప్రారంభించలేదని స్పష్టం చేశారు. 2003లో ఒంటరి మహిళల సాధికారత లక్ష్యంగా ఈ సంస్థను స్థాపించామని, తాను రాజకీయాల్లోకి వచ్చినది 2014లోనని తెలిపారు.
23 ఏళ్లుగా ఎలాంటి రాజకీయ పార్టీ, కులం, ప్రాంతీయ భావజాలంతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 6 లక్షల మంది మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ అందించామని వెల్లడించారు.
ఒంటరి మహిళల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న మదర్ ఫౌండేషన్ ద్వారా 33 వేల మంది మహిళలకు కుట్టు మిషన్లు అందించామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3 వేల గ్రూపులు పనిచేస్తున్నాయని, ప్రతి గ్రామంలో 60 నుంచి 100 మంది మహిళలు ఈ కార్యకలాపాల్లో భాగస్వాములుగా ఉన్నారని వివరించారు.
మోత్కూరు ప్రాంతంలో మూడు నెలల వ్యవధిలోనే 3,300 మందికి టైలరింగ్ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో అక్కడ శిక్షణ కేంద్రాలే లేవని, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మహిళలకు ఉపాధి మార్గాలు చూపగలిగామని చెప్పారు.
కార్యక్రమానికి హాజరైన మహిళలు తమ ఖర్చులతోనే బస్సులు ఏర్పాటు చేసుకుని వచ్చారని నిర్వాహకులు తెలిపారు. “మాకు చిత్తాలు వద్దు.. ఉపాధి కావాలి” అనే మహిళల అభిప్రాయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
“మదర్ ఫౌండేషన్ డబ్బులు పంచదు. ప్రేమను పంచుతుంది. నేనున్నాననే భరోసా కల్పిస్తుంది” అని పేర్కొన్నారు.
గతంలో ప్రభుత్వ పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ శాఖల యూనిఫాంల తయారీ బాధ్యతలు తమ సంస్థ నిర్వహించేదని, సంవత్సరానికి రూ.5 కోట్ల టర్నోవర్ సాధించేదామని తెలిపారు. అయితే గత రెండేళ్లుగా అలాంటి ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా సంఘాలతో పాటు నిజాయితీగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు కూడా ప్రభుత్వం అవకాశాలు కల్పించాలని కోరారు. మహిళా సంఘాల్లో ఐదుగురు సభ్యులు మాత్రమే ఉపాధి పొందే పరిస్థితి కాకుండా, మరింత విస్తృతంగా మహిళలకు ఉపాధి కల్పించే విధానాలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 20 కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి, ముందుగా శిక్షణ ఇచ్చిన తర్వాతే మిషన్లు పంపిణీ చేయాలని సూచించారు. “ముందు ట్రైనింగ్… తర్వాత మిషన్” అనే విధానాన్ని అమలు చేస్తే మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు వెళ్తారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పథకాలు ఉపయోగకరమే అయినప్పటికీ, నైపుణ్యాభివృద్ధి ద్వారా మహిళలకు శాశ్వత ఆదాయ వనరులు కల్పించడం మరింత ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
మంత్రి సీతక్క మహిళల కష్టాలను అర్థం చేసుకునే నాయకురాలని కొనియాడిన మదర్ ఫౌండేషన్ ప్రతినిధులు, తమ సూచనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేస్తే గ్రామీణ మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, మహిళల ఆర్థిక స్వావలంబనకు అది దోహదపడుతుందని పేర్కొన్నారు.
మహిళా సాధికారత అంటే కేవలం ఆర్థిక సాయం ఇవ్వడం కాదని, వారికి నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, స్థిరమైన ఉపాధి కల్పించడమే నిజమైన అభివృద్ధి అని కార్యక్రమంలో పలువురు అభిప్రాయపడ్డారు.

