ఉపాధే శాశ్వత పరిష్కారం.. మదర్ ఫౌండేషన్‌తో చర్చించి మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాం: మంత్రి సీతక్క

మహిళలకు ఉపాధి కల్పించి ఆర్థికంగా స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు.

మదర్ ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా వేలాది మంది మహిళలకు కుట్టు శిక్షణ అందిస్తూ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా చేరిన వారికి కుట్టు మిషన్లు అందించడంతో పాటు, బట్టలు కుట్టే పనులను కూడా కల్పిస్తున్నామని చెప్పారు. అయితే ఈ అవకాశాలు మరింత మందికి చేరేలా మదర్ ఫౌండేషన్ వంటి సంస్థలతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని హామీ ఇచ్చారు.

మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మండల సమాఖ్యలకు 553 బస్సులు అందజేసినట్లు వెల్లడించారు. ఈ బస్సుల ద్వారా వచ్చే ఆదాయం మహిళా సంఘాల ఖాతాల్లో జమవుతుందని, గ్రామీణ మహిళలకు అదనపు ఆదాయ వనరులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించడం వల్ల వేలాది మంది మహిళలు ఆర్థికంగా లాభపడుతున్నారని తెలిపారు. గత ఏడాది మహిళా సంఘాల ద్వారా నిర్వహించిన కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.159 కోట్ల ఆదాయం మహిళలకు చేరిందని వెల్లడించారు.

మదర్ ఫౌండేషన్ లక్షలాది మంది మహిళలకు శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌తో సమావేశం నిర్వహించి, ఈ సంస్థ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశాలను పరిశీలిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తృతంగా కుట్టు మిషన్లు అందించడం, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తామని తెలిపారు.

మహిళలకు కేవలం ఒకరోజు సహాయం చేయడం కంటే, జీవితాంతం ఉపాధి కల్పించే మార్గాలు చూపడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళా సంఘాలకు రూ.61 వేల కోట్ల రుణాలు అందించామని తెలిపారు. మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు, కుట్టు కేంద్రాలు, చిన్న పరిశ్రమలు స్థాపించేందుకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు.

ఇటీవల మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ మొత్తాలను కూడా ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. మహిళలకు ప్రమాద బీమా సదుపాయాలు కల్పిస్తూ, రుణగ్రహీత మరణించిన సందర్భాల్లో రుణమాఫీ సౌకర్యం కూడా అమలు చేస్తున్నామని చెప్పారు.

ఇప్పటికే లక్షలాది మంది మహిళలు ఈ పథకాల ద్వారా లబ్ధి పొంది, వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. కొందరు కుట్టు కేంద్రాలు, మరికొందరు చీరల తయారీ, అలంకరణ సేవలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్నారని తెలిపారు.

మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు హైదరాబాద్ శిల్పారామంలో ప్రత్యేక దుకాణాలు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా బజార్లు ఏర్పాటు చేసి, గ్రామీణ మహిళల ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు.

మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసే వారిపై తీవ్రంగా స్పందించిన మంత్రి సీతక్క, ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను కించపరిచేలా కొందరు కావాలనే వీడియోలు రూపొందిస్తున్నారని విమర్శించారు. మహిళలను తక్కువ చేసి మాట్లాడే వారిని సహించబోమని హెచ్చరించారు.

“ఆకాశంలోకి వెళ్లగలిగే శక్తి మహిళలకు ఉంది. భూదేవి ఓర్పు, రాకెట్ వేగం రెండూ మహిళల్లో ఉన్నాయి. మహిళా శక్తిని గౌరవించాలి. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తోంది” అని మంత్రి సీతక్క అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *