తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై మరోసారి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుందని ప్రభుత్వం చెబుతుండగా, ఉద్యోగాల కల్పన, రైతుల భూముల స్వాధీనం, పెట్టుబడుల వాస్తవ పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని విమర్శకులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు?
ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రపంచ స్థాయి కంపెనీలను తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఆ కంపెనీలు స్థానిక యువతకు ఎంత మేర ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
“ఏ కంపెనీ వచ్చినా తమ సొంత బృందాలను తీసుకువస్తే తెలంగాణ యువతకు ప్రయోజనం ఏమిటి? స్థానికులకు ఉద్యోగాల్లో ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తారు?” అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఏ కంపెనీ వచ్చినా తమ సొంత బృందాలను తీసుకువస్తే తెలంగాణ యువతకు ప్రయోజనం ఏమిటి? స్థానికులకు ఉద్యోగాల్లో ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తారు?” అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రైతులకు భరోసా ఎక్కడ?
ఫ్యూచర్ సిటీ కోసం వేల ఎకరాల భూములు అవసరమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ భూములు ఎక్కడి నుంచి సేకరిస్తారు? ఎంతమంది రైతులు ప్రభావితమవుతారు? వారికి ఎంత పరిహారం ఇస్తారు? పునరావాసం ఎలా ఉంటుంది? అనే అంశాలపై స్పష్టత కోరుతున్నారు.
భూమిని కోల్పోయిన రైతులు తిరిగి అదే స్థాయిలో జీవనం కొనసాగించగలరా? వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తారా? అనే ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి.
77 గ్రామాల భవిష్యత్తుపై ఆందోళన
ఫ్యూచర్ సిటీ విస్తరణతో పలు గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్రామాల ఉనికి, స్థానిక సంస్కృతి, వ్యవసాయ ఆధారిత జీవన విధానంపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్
గ్లోబల్ సమ్మిట్‌లో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అవి ఏ దశలో ఉన్నాయో ప్రజలకు వివరించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
- ఎన్ని MoUs కుదిరాయి?
- వాటిలో ఎన్ని అమలు దశకు చేరాయి?
- DPRలు సిద్ధమయ్యాయా?
- ఎన్ని ఉద్యోగాలు వస్తాయి?
- స్థానికులకు ఎంత ప్రాధాన్యం ఉంటుంది?
అనే అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమా?
అన్ని ప్రాజెక్టులను హైదరాబాద్ చుట్టుపక్కలే కేంద్రీకరించకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా ఐటీ, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.
దీంతో స్థానికంగా చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా హైదరాబాద్‌పై ఒత్తిడి కూడా తగ్గుతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
రెవెన్యూపై కూడా స్పష్టత కావాలి
రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత? ఖర్చు ఎంత? ఇప్పటివరకు తీసుకున్న అప్పులు ఎంత? ఫ్యూచర్ సిటీ కోసం అవసరమయ్యే పెట్టుబడి ఎంత? అనే అంశాలపై కూడా ప్రభుత్వం ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అభివృద్ధి కావాలి.. కానీ స్పష్టతతో
అభివృద్ధిని ఎవరూ వ్యతిరేకించరని, కానీ ఆ అభివృద్ధి వల్ల ప్రభావితమయ్యే రైతులు, స్థానిక ప్రజలు, యువత భవిష్యత్తుపై స్పష్టమైన హామీలు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఫ్యూచర్ సిటీ నిజంగా తెలంగాణ భవిష్యత్తును మార్చే ప్రాజెక్టుగా నిలుస్తుందా? లేక ఉద్యోగాలు, భూసేకరణ, అప్పుల భారం, పరిహారం వంటి ప్రశ్నలకు సమాధానాలు లేకుండా వివాదాల కేంద్రంగా మారుతుందా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

