హైదరాబాద్: నగర ప్రజలకు హైదరాబాద్ జలమండలి కీలక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్, ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు రాబోయే కొన్ని గంటల పాటు తాగునీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని సూచించింది. నగరానికి తాగునీటిని సరఫరా చేసే మంజీరా ఫేజ్-2 ప్రధాన పైప్‌లైన్‌లో భారీ లీకేజీ ఏర్పడటమే దీనికి కారణమని అధికారులు వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామం సమీపంలో కల్బుగూర్ నుంచి పటాన్‌చెరువుకు నీటిని తరలించే 1500 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ప్రధాన పైప్‌లైన్ పగిలిపోయింది. దీంతో లక్షలాది లీటర్ల తాగునీరు వృథాగా రోడ్లపైకి చేరింది.
సమాచారం అందుకున్న వెంటనే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (జలమండలి) అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు ప్రారంభించారు. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి స్వయంగా ఘటనాస్థల పరిస్థితులను సమీక్షించి, అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆయన సూచనల మేరకు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (O&M), ట్రాన్స్మిషన్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, సాధ్యమైనంత తక్కువ సమయంలో మరమ్మతులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట ఉచిత ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ప్రస్తుతం వందలాది మంది సిబ్బంది ఆధునిక యంత్రాల సహాయంతో లీకేజీని అరికట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పనులు పూర్తయ్యగానే నీటి సరఫరాను సాధారణ స్థితికి తీసుకొస్తామని జలమండలి అధికారులు స్పష్టం చేశారు.
ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం:
- O&M డివిజన్-17: ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్
- O&M డివిజన్-22: బీరంగూడ, అమీన్పూర్, భాగ్యనగర్ కాలనీ
- O&M డివిజన్-6: ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట్
- O&M డివిజన్-9: కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతి నగర్
ఈ ప్రాంతాల్లో సాధారణ సమయంతో పోలిస్తే ఆలస్యంగా నీరు రావచ్చు లేదా తాత్కాలికంగా సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ప్రజలకు సూచనలు:
- ఇంట్లో ఉన్న నిల్వ నీటిని తాగునీరు, వంట అవసరాలకు మాత్రమే వినియోగించాలి.
- వాహనాలు కడగడం, మొక్కలకు నీరు పోయడం వంటి పనులను తాత్కాలికంగా వాయిదా వేయాలి.
- అవసరమైతే ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలి.
- తీవ్ర నీటి కొరత ఉన్న ప్రాంతాల ప్రజలు జలమండలి కస్టమర్ కేర్ లేదా అధికారిక యాప్ ద్వారా ఉచిత ట్యాంకర్ల కోసం అభ్యర్థించవచ్చు.
మరమ్మతు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే నీటి సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడుతుందని జలమండలి భరోసా ఇచ్చింది. తాజా సమాచారం కోసం అధికారిక ప్రకటనలను గమనించాలని నగరవాసులకు సూచించింది.

