రేగా కాంతారావుపై అత్యాచారం కేసు.. పెళ్లి పేరుతో మోసం చేశారంటూ యువతి ఫిర్యాదు

బీఆర్ఎస్ నాయకుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి మోసం చేశారంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అత్యాచారం, లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసు నమోదు చేశారు. అయితే ఈ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని రేగా కాంతారావు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువతి 2022లో ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చి ఓ యూట్యూబ్ ఛానల్‌లో పనిచేస్తోంది. అదే సమయంలో రేగా కాంతారావు కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తానని చెప్పి పరిచయం పెంచుకున్నారని, అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం ప్రారంభించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

అమీర్‌పేటలో ఓ ఫ్లాట్‌లో తనను ఉంచి పలుమార్లు కలిశారని, తర్వాత దూరం కావడంతో ఇద్దరూ కలిసి దిగిన వ్యక్తిగత ఫోటోలు బయటపెడతానని బెదిరించారని ఆరోపించింది. అలాగే రియల్ ఎస్టేట్ పెట్టుబడి పేరుతో రూ.4 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని, డబ్బు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది.

యువతి ముందుగా షీ టీంను ఆశ్రయించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, అనంతరం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయిందని పోలీసులు తెలిపారు. మరోవైపు కేసు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులో వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నాయని, విచారణ అనంతరం వాస్తవాలు వెల్లడికానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *