స్టైఫండ్ పెంచాలి.. AYUSH పీజీ విద్యార్థుల సమ్మె.. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి

తెలంగాణలో ఆయుష్ (ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, సిద్ధ, నేచురోపతి) పీజీ, యూజీ విద్యార్థులు స్టైఫండ్ పెంపు కోసం ఆందోళన బాట పట్టారు. పదేళ్లుగా తమ స్టైఫండ్‌లో సరైన పెంపు లేదని, జీవన వ్యయం భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న మొత్తం సరిపోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీ విద్యార్థులకు ప్రస్తుతం సుమారు రూ.30 వేల స్టైఫండ్, హౌస్ సర్జన్లకు రూ.18 వేల వరకు మాత్రమే అందుతోందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే అత్యల్ప స్టైఫండ్ ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

విద్యార్థుల ప్రకారం 2023లో సమ్మె చేసిన తర్వాత కేవలం 30 శాతం మాత్రమే స్టైఫండ్ పెంచారని, అప్పటి నుంచి మళ్లీ ఎలాంటి పెంపు జరగలేదని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి స్టైఫండ్ పెరగాల్సి ఉన్నప్పటికీ ఆ అమలు జరగలేదని చెప్పారు. ఇప్పటికే 60కిపైగా వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని, అందుకే సమ్మె చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఆయుష్ విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ ఇస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో రూ.60 వేలకుపైగా, మరికొన్ని రాష్ట్రాల్లో లక్ష రూపాయలకు పైగా స్టైఫండ్ అందుతోందని విద్యార్థులు తెలిపారు. తెలంగాణలో మాత్రం తాము వెనుకబడిపోయామని, ఆయుష్ విద్యార్థులకు ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

విద్యార్థులు స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే.. తాము ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేయలేదని, రోగులకు అత్యవసర సేవలు అందిస్తూనే తమ విధుల నుంచి మాత్రమే వైదొలిగి శాంతియుతంగా సమ్మె చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను అంగీకరించి ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ ఇవ్వాలని కోరుతున్నారు.

ఈ సమ్మెను తొలుత 15 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించామని, ప్రభుత్వం స్పందించకపోతే మరింత ఉధృతం చేసే అవకాశం ఉందని విద్యార్థి ప్రతినిధులు హెచ్చరించారు. కేవలం 20 లేదా 30 శాతం పెంపు కాదు, ఇతర రాష్ట్రాలు, ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ ఇవ్వాలని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని ఆయుష్ కళాశాలల్లో పీజీ, యూజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లు సమ్మెలో పాల్గొంటున్నారు. తమ సేవలకు తగిన గౌరవం, న్యాయమైన స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం, ముఖ్యంగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

విద్యార్థుల అభిప్రాయం ప్రకారం తాము కోరుతున్నది అదనపు ప్రయోజనం కాదని, ఇప్పటికే ప్రభుత్వ నిబంధనల్లో ఉన్న ప్రతి రెండేళ్లకోసారి స్టైఫండ్ పెంపు అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని తెలిపారు. ప్రభుత్వం త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *