తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. వివాదాస్పద మెసేజ్‌పై చర్చ

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయ, విద్యా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఆయన తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుకు పంపినట్లు సమాచారం.

తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశానని, రాష్ట్ర విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేశానని ఆకునూరి మురళి తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఆకునూరి మురళి 2024 సెప్టెంబర్‌లో తెలంగాణ తొలి విద్యా కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, మిడ్ డే మీల్స్ నాణ్యత, తెలంగాణ విద్యా విధానం, యూజీసీ నిబంధనలు, ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ల వయస్సు, ఇంగ్లీష్ మీడియం, టీచర్ ఎడ్యుకేషన్ వంటి అంశాలపై ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు ప్రతిపాదన కూడా ఆయన సూచనలలో భాగమే కావడం గమనార్హం.

అయితే ఆకస్మికంగా ఆయన రాజీనామా చేయడం వెనుక వేరే కారణాలు ఉన్నాయా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది. ముఖ్యంగా ఒక వివాదాస్పద వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై మతపరమైన వ్యాఖ్యలు చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.

వైరల్ అవుతున్న సందేశంలో “హిందూ బంధువులు” అనే నినాదంపై వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ప్రభుత్వ ఒత్తిడి వచ్చిన నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.

అయితే ఇప్పటివరకు ఆకునూరి మురళి స్వయంగా ఈ ఆరోపణలపై ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. ప్రభుత్వం కూడా ఈ అంశంపై అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం నిజానిజాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇక ఆయన పదవీకాలానికి ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉండగానే రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం లేదా ఆకునూరి మురళి నుంచి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *