తెలంగాణ బీజేపీలో కొత్త మంత్రి పదవి చర్చ.. ఈటల, అరవింద్ మధ్య పోటీ?

తెలంగాణ బీజేపీలో మరో కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి మరో బీసీ నేతకు కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం దక్కొచ్చనే ప్రచారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ కొనసాగుతున్నారు. అయితే ఈసారి బీసీ సామాజిక వర్గానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంక్‌ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో మరో బీసీ ఎంపీకి మంత్రి పదవి ఇవ్వాలనే చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ పార్టీకి కీలక నేతలే కావడంతో ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌కు బలమైన రాజకీయ ఆధారం, కార్యకర్తల మద్దతు ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. ఇటీవలి కులగణన చర్చల నేపథ్యంలో ముదిరాజ్ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

మరోవైపు మున్నూరు కాపు వర్గానికి చెందిన ధర్మపురి అరవింద్ కూడా కేంద్ర మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. బీజేపీలో చురుకుగా పనిచేస్తూ పార్టీకి సేవలు అందించిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. అయితే ఇప్పటికే అదే సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగుతుండడంతో అరవింద్‌కు అవకాశం దక్కుతుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

అదేవిధంగా కే లక్ష్మణ్ పేరు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన కూడా కేంద్రంలో కీలక బాధ్యతల కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రులను తొలగించే ఆలోచనలో అధిష్టానం లేదని తెలుస్తోంది. ఎవరిని పక్కన పెట్టినా తప్పుడు రాజకీయ సంకేతాలు వెళ్లే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఉన్న వారిని కొనసాగిస్తూ అదనంగా మరో మంత్రి పదవి ఇవ్వాలనే దిశగా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి విషయంలోనూ అంతర్గత పోటీ తీవ్రంగా కనిపించింది. చివరకు రామచంద్రరావుకు బాధ్యతలు అప్పగించిన తర్వాత కూడా కొంతకాలం నేతల మధ్య అసంతృప్తి కనిపించిందనే చర్చ జరిగింది. ఇప్పుడు మళ్లీ మంత్రి పదవి అంశంతో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ హాట్ టాపిక్‌గా మారింది.

మరి కేంద్ర బీజేపీ అధిష్టానం చివరకు ఎవరికి అవకాశం కల్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *