తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 116 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేయడానికి కోఆర్డినేటర్లను నియమించింది. ఈ నియామకాలకు ఏఐసిసి తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోదముద్రతో టీపీసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధికారిక జాబితాను విడుదల చేశారు.
ఈ జాబితాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మాజీ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అర్కేపూడి గాంధీ, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, కార్పొరేషన్ చైర్మన్ ఎలవర్తి అనిల్ కుమార్‌లను కోఆర్డినేటర్లుగా నియమించారు. ఇదే ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది.
ఇటీవలే స్పీకర్ ఇచ్చిన తీర్పులో అర్కేపూడి గాంధీతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, వారు బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని స్పష్టంగా పేర్కొన్నారు. యూట్యూబ్ వీడియోలు, బహిరంగ సభలలో పాల్గొనడం వంటి అంశాలను చట్టపరంగా పరిగణలోకి తీసుకోలేమని కూడా స్పీకర్ స్పష్టం చేశారు.
అయితే ఇప్పుడు అదే అర్కేపూడి గాంధీని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎన్నికల ప్రచార కోఆర్డినేటర్‌గా నియమించడం తీవ్ర ప్రశ్నలకు దారి తీస్తోంది. ఒకవైపు స్పీకర్ “వారు బిఆర్ఎస్‌లోనే ఉన్నారు” అని తీర్పు ఇస్తే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ వారిని తమ ప్రచార కమిటీల్లో కీలక బాధ్యతలు అప్పగించడం రాజకీయ ద్వంద్వ వైఖరిని స్పష్టంగా బయటపెడుతోంది.
ఇదే తరహా పరిస్థితి గతంలో జూబిలీహిల్స్ ఉపఎన్నికల సమయంలో కూడా చోటుచేసుకున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పట్లోనూ బిఆర్ఎస్‌కు చెందిన నేతలను కాంగ్రెస్ ప్రచారంలో వినియోగించుకున్న ఉదాహరణలు ఉన్నాయని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
ప్రజలను మభ్యపెట్టేలా ఒక మాట ఒక చర్యగా ఈ వ్యవహారం కొనసాగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. స్పీకర్ తీర్పు ఒకలా, ఏఐసిసి–టీపీసిసి నిర్ణయాలు మరోలా ఉండటం వల్ల అసలు నిజం ఏమిటనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి.
ఇలాంటి రాజకీయ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారం రానున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని అంటున్నారు.

