ఓలా, ఉబర్, రాపిడో వంటి కార్పొరేట్ క్యాబ్ యాప్‌లు వచ్చిన తర్వాత ఆటో, క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి గణనీయంగా దిగజారిందన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. పెట్రోల్ ఖర్చులకు సరిపడే ఆదాయం వస్తే చాలన్న స్థితికి డ్రైవర్లు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవర్లు ఎప్పటి నుంచో ఒక డిమాండ్ చేస్తూ వస్తున్నారు — ప్రభుత్వ మద్దతుతో జీరో కమిషన్ యాప్ తీసుకురావాలి అని.
ఈ డిమాండ్‌కు స్పందనగా కేంద్ర ప్రభుత్వం సహకార మోడల్‌లో ‘భారత్ టాక్సీ’ అనే కొత్త రైడ్ హైలింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ యాప్‌ను అధికారికంగా లాంచ్ చేశారు. డ్రైవర్‌నే యజమానిగా మార్చే కోఆపరేటివ్ ఓనర్షిప్ విధానంలో ఈ సేవలు పనిచేస్తాయని కేంద్రం ప్రకటించింది.
భారత్ టాక్సీ ప్రత్యేకత ఏమిటంటే — డ్రైవర్ల నుంచి ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోదు. ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్‌లు 10% నుంచి 40% వరకు కమిషన్ కట్ చేస్తుండగా, భారత్ టాక్సీలో బుకింగ్ మొత్తమంతా నేరుగా డ్రైవర్ జేబులోకే వెళ్తుంది. 200 రూపాయల రైడ్ అయినా, 400 రూపాయల రైడ్ అయినా పూర్తి మొత్తం డ్రైవర్‌కే అందుతుంది.
ఈ ప్లాట్‌ఫామ్ పూర్తిగా సహకార విధానంలో నడుస్తుంది. డ్రైవర్లే ఇందులో కో-ఓనర్లుగా ఉంటారు. అంతేకాదు, ప్రతి డ్రైవర్‌కు ₹5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, ₹5 లక్షల ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ సేవింగ్స్ సదుపాయాలను కూడా కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రమాదాలకు ఎప్పుడూ గురయ్యే అవకాశం ఉన్న డ్రైవర్లకు ఇది ఒక పెద్ద భద్రతగా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్, గుజరాత్ రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్న భారత్ టాక్సీకి ఇప్పటికే మూడు లక్షలకు పైగా డ్రైవర్లు, లక్షల మంది వినియోగదారులు ఆన్‌బోర్డ్ అయ్యారని కేంద్రం వెల్లడించింది. ప్రతిరోజూ వేలాది రైట్లు జరుగుతున్నట్లు సమాచారం. మరో మూడు సంవత్సరాల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నట్లు అమిత్ షా ప్రకటించారు.
భారత్ టాక్సీలో కార్లతో పాటు టూ వీలర్లు, త్రీ వీలర్లు కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ‘బైక్ దీదీ’ ఇనిషియేటివ్ ద్వారా మహిళా రైడర్లను ప్రోత్సహించనున్నారు. మహిళా ప్రయాణికుల కోసం మహిళా డ్రైవర్లే సేవలు అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఇది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, భద్రతను కూడా పెంచే చర్యగా భావిస్తున్నారు.
ఇంకొక ముఖ్యమైన అంశం — సర్జ్ ప్రైసింగ్ లేదు. పండుగలు, వర్షాలు, డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలోనూ చార్జీలు పెంచే అవకాశం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రయాణికులకు స్థిరమైన, సరసమైన చార్జీలు ఉంటాయని తెలిపింది.
అయితే, ఈ యాప్ పూర్తిగా విజయవంతం కావాలంటే కొన్ని కీలక అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. యాప్ నిర్వహణ పూర్తిగా ట్రాన్స్పరెంట్‌గా ఉండాలి. భవిష్యత్తులో మెయింటెనెన్స్ పేరుతో లేదా ఇతర ఛార్జీల పేరుతో కమిషన్లు ప్రవేశపెట్టకూడదు. అలాగే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా కీలకం.
ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక యాప్‌లు సరైన ప్రచారం లేక వాడుకలోకి రాలేదన్న అనుభవం ఉంది. భారత్ టాక్సీ విషయంలో అలా జరగకుండా ప్రజలను ఈ యాప్ వైపు తీసుకురావడం, డ్రైవర్లు ఒకే ప్లాట్‌ఫామ్‌ను ప్రాధాన్యంగా ఉపయోగించడం అత్యంత అవసరం.
మొత్తానికి, గిగ్ వర్కర్లకు, ముఖ్యంగా ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు భారత్ టాక్సీ ఒక మంచి అవకాశంగా కనిపిస్తోంది. ఇది నిజంగా డ్రైవర్ల చేతుల్లోనే కొనసాగితే, కార్పొరేట్ యాప్‌లకు గట్టి పోటీగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు.

