తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరుకోవడంతో రాజకీయ వాతావరణం తీవ్రంగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వివాదాలు, ఎన్నికల హామీలు, ఫారెన్సిక్ ల్యాబ్ ఘటన, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వంటి అనేక అంశాలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఫారెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం, కీలక ఆధారాలపై అనుమానాలు, బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య “ఫెవికాల్ బంధం” అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాకేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
మహాలక్ష్మి పథకం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, ఉచిత బస్సు ప్రయాణం, స్కూటీల పంపిణీ వంటి హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. బస్సుల్లో మహిళల భద్రత కరువైందని, గొలుసు దొంగతనాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, అభివృద్ధి, పరిపాలన అన్ని రంగాల్లో విఫలమైందని రాకేష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి కనిపించడంలేదని, విద్యా వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని అన్నారు. పేదలకు ఆయుధంలాంటి విద్యను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో శాంతి, భయరహిత వాతావరణం నెలకొల్పినట్టు చెప్పారు. గతంలో గుండాగిరి, అక్రమ కేసులు, భయభ్రాంతులు ఉన్నాయని, ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని అన్నారు. తమ పాలనలో కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేవని, న్యాయం, నిజాయితీ మాత్రమే తమ సిద్ధాంతమని స్పష్టం చేశారు.
ఈ మున్సిపల్ ఎన్నికల్లో యువతకు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ 21 ఏళ్ల యువతిని కౌన్సిలర్‌గా బరిలోకి దింపినట్టు తెలిపారు. ముస్లిం, హిందూ అన్న తేడా లేకుండా యువత రాజకీయాల్లోకి రావాలని, మహిళలకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆ యువతి తమ బిడ్డతో సమానమని, ప్రజల బిడ్డగా భావించి ఆశీర్వదించాలని కోరారు.
చివరగా, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని, ధర్మం, న్యాయం, అభివృద్ధి వైపే ప్రజలు నిలబడతారని రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

