“నిజామాబాద్ నుంచే గులాబీ గర్జన.. ఆర్మూర్‌లో వన్‌సైడ్ వార్ – కేసీఆర్ పేరుతో ప్రత్యర్థులపై తీవ్ర దాడి”

2001లో తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచే నిజామాబాద్ జిల్లా కేసీఆర్‌కు అండగా నిలిచిందని బీఆర్‌ఎస్ నేతలు గుర్తు చేశారు. ఆ రోజుల్లోనే నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ పదవి దక్కిందని, అదే రాజకీయ ఊపు ఇప్పుడు మళ్లీ వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల బోధన్‌లో నిర్వహించిన సమావేశంలో గులాబీ జెండా ఎగిరేసినట్టుగా, నిజామాబాద్ అర్బన్‌లో కూడా బీఆర్‌ఎస్‌దే కీలక పాత్రగా ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రత్యేకంగా ఆర్మూర్ నియోజకవర్గంపై మాట్లాడిన నేతలు, అక్కడ ఎన్నికలు పూర్తిగా వన్‌సైడ్‌గా మారాయని అన్నారు. టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్‌ఎస్)కు వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ ఇవ్వలేని స్థితిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆర్మూర్ రాజకీయాల్లో ప్రత్యర్థుల గతం, వారి జీవితం, భవిష్యత్తు అన్నీ ప్రజలకు తెలుసని అన్నారు.

ప్రత్యర్థులపై తీవ్ర ఆరోపణలు చేసిన నేతలు, తమపై కబ్జా ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. “నేను ఒక్క రూపాయి అవినీతి చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. బాండ్ పేపర్ తెచ్చుకోండి, టీవీల ముందే రాసిచ్చేందుకు సిద్ధం” అంటూ బహిరంగంగా సవాల్ చేశారు. తమ ఫ్యాక్టరీలు, ఆస్తులు, ఆదాయానికి సంబంధించిన వివరాలన్నీ ప్రభుత్వ శాఖల వద్దనే ఉన్నాయని తెలిపారు.

2013లో మల్టీప్లెక్స్ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలను కూడా ఖండించారు. అప్పటి ప్రభుత్వంలో తీసుకున్న ఆస్తి తమది కాదని, తర్వాత పరిస్థితుల నేపథ్యంలో ఇన్వాల్వ్ అయ్యామని చెప్పారు. న్యాయం లేకపోతే ఆ సంస్థ అప్పుడే మూసివేసేవారని, కానీ ఇప్పటికీ కొనసాగుతుండటం తమ వాదనకు నిదర్శనమని అన్నారు.

ఆర్మూర్ ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు అడగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 13 ఎకరాల భూకబ్జా ఆరోపణలపై డాక్యుమెంట్లతో నిరూపిస్తామని, ఒకవేళ తప్పు తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటామని స్పష్టం చేశారు.

మొత్తంగా ఆర్మూర్‌లో బీఆర్‌ఎస్‌దే గెలుపు అని, ప్రజలు మరోసారి గులాబీ జెండాకు మద్దతు ఇవ్వబోతున్నారని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు అవాకులు, చవాకులు మాట్లాడటం తప్ప ప్రజలకు చెప్పడానికి ఏమీ లేదని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *