అసెంబ్లీని వదిలేసి ప్రెస్ మీట్లు ఎందుకు? ప్రజల డబ్బు వృథాపై ప్రతిపక్షానికి సోయి లేదా?

ఇది మీ పర్సనల్ పార్టీ ఆఫీస్‌లో పెట్టుకున్న ప్రెస్ మీట్ కాదు.. అసెంబ్లీ. అక్కడ మాట్లాడితేనే మాటలకు శాసనబద్ధత ఉంటుంది. ఒక అంశాన్ని సభలో లేవనెత్తితే దానిపై చర్చ జరుగుతుంది, సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశం ఉండగానే, అసెంబ్లీని వదిలేసి బయట ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా గత పదేళ్లుగా తెలంగాణ ప్రజలను గాలికి వదిలేశారనే విమర్శలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి.

బీజేపీ విషయానికి వస్తే.. తమ వరకు సమస్య వచ్చినప్పుడే స్పందిస్తారు తప్ప, నిరంతరంగా ప్రజా సమస్యలపై మాట్లాడిన దాఖలాలు లేవని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అసలు ప్రధాన ప్రతిపక్షమే లేకపోవడం వల్ల శాసనసభలో పెద్ద లోటు స్పష్టంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు నిర్వహించాలని ప్రతిపక్షమే డిమాండ్ చేసింది. ఒక రోజు సరిపోదని, కనీసం 20 రోజులు కావాలంటూ వాదించింది. చివరకు ప్రభుత్వం ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించింది. కానీ ఈ సమావేశాల నిర్వహణకు అయ్యే ఖర్చుపై మాత్రం ఎవరూ మాట్లాడడం లేదు.

ఒక రోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించేందుకు నిమిషానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతోందని అంచనా. అంటే రోజుకు సుమారు రూ.కోటి నుంచి కోటిన్నర వరకు ఖర్చు అవుతోంది. ఎమ్మెల్యేల జీతాలు, సిబ్బంది, భద్రత, భోజనాలు, కాన్వాయ్‌లు, ఈగల్ టీమ్, టైపిస్టులు ఇలా అన్నీ కలిపి ప్రజల పన్నుల డబ్బే ఖర్చవుతోంది.

అప్పుల్లో ఉన్నామని, బడ్జెట్ పరిస్థితి బాగోలేదని ప్రభుత్వాలు చెబుతున్న తరుణంలో, ప్రజల డబ్బును ఇంత నిర్లక్ష్యంగా వృథా చేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సిన ప్రతిపక్షం, సభను బాయికాట్ చేసి బయట ధర్ణాలు చేయడం ద్వారా ప్రజలకు ఏం ఉపయోగం కలుగుతుందన్న చర్చ జరుగుతోంది.

హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పార్టీ రూ.5 లక్షల కోట్ల స్కామ్ జరుగబోతుందని తీవ్ర ఆరోపణలు చేసింది. అదే అంశంపై అసెంబ్లీలో నేరుగా చర్చ కూడా జరిగింది. ప్రభుత్వం ప్రతిపక్షం అడిగిన ప్రతీ అంశంపై చర్చకు సిద్ధమైందని, హిల్ట్ పాలసీ, జీరామజీ బిల్లు, హైడ్రా, నీటి సమస్యలపై సభలో చర్చలు పెట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ ఆ చర్చలకు ప్రతిపక్షం హాజరు కాలేదన్నది ప్రభుత్వ వాదన.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు హిల్ట్ పాలసీ అత్యంత పారదర్శకమని, దీని ద్వారా రూ.10,776 కోట్ల ఆదాయం వస్తుందని సభలో వివరించారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయినా ప్రతిపక్షం సభలో ఆధారాలతో మాట్లాడకుండా బయట మైక్‌ల ముందు వ్యాఖ్యలు చేయడమేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అసెంబ్లీలో మాట్లాడితేనే నిజాలు నిర్ధారణ అవుతాయి. పీపీటీ ప్రెజెంటేషన్లు పార్టీ ఆఫీస్‌లలో పెట్టుకుంటే ప్రజలకు ఉపయోగం ఉండదు. సభను వేదికగా చేసుకుని మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ అసెంబ్లీ సమావేశాల వల్ల రాజకీయ పార్టీలకు లాభం ఉందా లేదా అన్నది పక్కన పెడితే.. ప్రజలకు మాత్రం డబ్బు వృథా, సమస్యలపై చర్చ జరగకపోవడం వల్ల నష్టం జరుగుతోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికైనా ప్రతిపక్షం తన పాత్రను సరిగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *