హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ కార్యాలయం ముందు జనసేన నేత భీమ నరేందర్ రెడ్డి నిరసనకు దిగారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ప్రకటిస్తున్న ఉద్యోగాల భర్తీ గణాంకాలపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య అధికంగా ఉందని, యువతలో నిరుద్యోగ శాతం 8.9 శాతంగా ఉందని భీమ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న ఉద్యోగాల సంఖ్యకు, వాస్తవంగా భర్తీ చేసిన పోస్టులకు భారీ తేడా ఉందని ఆరోపించారు. వివిధ నోటిఫికేషన్ల వివరాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం చెప్పిన 60 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ లెక్కలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
గ్రూప్-1, డీఎస్సీ, వైద్య ఆరోగ్య శాఖ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తదితర పోస్టుల నోటిఫికేషన్లను ఉదాహరణగా చూపిస్తూ మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో అధికారికంగా వెల్లడించాలని కోరారు. పోలీస్ శాఖలో ఎస్ఐలు, కానిస్టేబుళ్ల నియామకాలపై కూడా స్పష్టత లేదన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోయిందని ఆయన విమర్శించారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదని ఆరోపించారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగుల స్థానాల్లో నియామకాలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, వేలాది ఖాళీలు ఇంకా భర్తీ కాలేదని అన్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ప్రకటించిన లెక్కలను టీజీపీఎస్సీ అధికారులు బహిర్గతం చేయాలని, లెక్కలు చెప్పే వరకు తాను ఆందోళన కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
టీజీపీఎస్సీ ఛైర్మన్ లేదా సంబంధిత అధికారులు వచ్చి ఉద్యోగాల భర్తీపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేసిన భీమ నరేందర్ రెడ్డి, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఇక సాగవని, ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించాలని ఆయన అన్నారు.

