జనసేనతో పొత్తు బీజేపీకి భారమేనా? తెలంగాణలో పవన్ కళ్యాణ్ అంశం కమలం పార్టీలో కలవరం

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ–జనసేన పొత్తు అంశం ఇప్పుడు కమలం పార్టీలోనే తీవ్ర చర్చకు దారి తీస్తోంది. రాష్ట్రంలో జనసేనతో పొత్తు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని బీజేపీలోని మెజారిటీ నేతలు బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ వాదులుగా గుర్తింపు ఉన్న బీజేపీ నాయకులు ఈ పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.

స్వరాష్ట్ర ఉద్యమ కాలంలో ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తెలంగాణ ప్రజల మదిలో ఉన్నాయని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. గతంలో ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్, ఇటీవల డిప్యూటీ సీఎం హోదాలో ఉండి “కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది” అంటూ వ్యాఖ్యానించడం తెలంగాణ సమాజాన్ని అవమానించేలా ఉందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

జనసేనను ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా జాతీయ స్థాయిలో అంగీకరించినా, తెలంగాణలో మాత్రం ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ నేతలు ససేమీరా అంటున్నారని సమాచారం. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు చెందిన నాయకులు ఈ విషయంలో గట్టిగా నిలబడుతున్నారు.

పవన్ కళ్యాణ్ అభిమానులు, కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌కు పరిమితమై ఉన్నారని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్నికలే జరగని పరిస్థితిలో జనసేనతో పొత్తు వల్ల బీజేపీకి ఎలాంటి అదనపు ఓటు బ్యాంక్ లాభం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా పవన్ కళ్యాణ్ వచ్చి తెలంగాణలో ప్రచారం చేసినంత మాత్రాన బీజేపీ గెలుస్తుందనుకోవడం ఒక భ్రమ మాత్రమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.

తెలంగాణలో బీజేపీకి ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు వంటి స్థానిక నాయకత్వం ఉన్నప్పటికీ, వారిని సమన్వయంగా వినియోగించుకోలేకపోవడమే అసలు సమస్యగా అభివర్ణిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి లేదా ఢిల్లీ నుంచి నాయకులను తీసుకొచ్చి ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ ప్రజల సమస్యలు చెప్పలేరని, స్థానిక నాయకులకే ఆ బాధ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా, కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రెండు కార్పొరేషన్లలో ఎలాగైనా మేయర్ పదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతో ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.

ఇదిలా ఉండగా, కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రెండు కార్పొరేషన్లలో ఎలాగైనా మేయర్ పదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతో ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.

కరీంనగర్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 13 స్థానాలకే పరిమితమైంది. ఈసారి 40కి పైగా డివిజన్లు గెలిచి స్వయంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో బండి సంజయ్ పనిచేస్తున్నారని సమాచారం. అదే విధంగా నిజామాబాద్‌లో 60 డివిజన్లలో గతంలో 24 గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా, బీఆర్ఎస్–ఎంఐఎం పొత్తుతో మేయర్ పదవి చేజారింది. ఈసారి కనీసం 40 స్థానాలు గెలిచి మేయర్ పదవిని సాధించాలని అరవింద్ వ్యూహం రచిస్తున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తు అంశం బీజేపీకి అవసరమా? లేక ఇది పార్టీని మరింత గందరగోళంలోకి నెట్టే అంశమా? అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *