బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘర్షణ: మీడియాపై దాడి, నేతల మధ్య ఆధిపత్య పోరు

బీజేపీ పార్టీ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత: మీడియాపై దాడి, నేతల మధ్య బహిరంగ ఘర్షణ

బీజేపీ పార్టీ కార్యాలయం ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. ఆరో వార్డు అంశం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విషయంలో మొదలైన వివాదం చివరకు నేతలు–కార్యకర్తల మధ్య బహిరంగ ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో మీడియాపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది.

పార్టీ కార్యాలయంలో సమావేశం జరుగుతున్న సమయంలో కొందరు నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. మాటల వాగ్వాదం కాస్తా చేతుల దాకా వెళ్లి, పరస్పరం గుద్దుకోవడం, చొక్కాలు పట్టుకోవడం, కుర్చీలు విసరడం వరకు పరిస్థితి దిగజారింది. ఈ ఘర్షణను కవర్ చేయడానికి వచ్చిన మీడియా సిబ్బందిని కూడా అడ్డుకోవడం, వారి కెమెరాలను బలవంతంగా తీసుకుని ఫార్మాట్ చేయాలని ప్రయత్నించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

మీడియా ప్రతినిధులు “ఇది మీ వ్యక్తిగత ఇల్లు కాదు… ఇది జాతీయ పార్టీ కార్యాలయం. మాకు కూడా స్వేచ్ఛ ఉంది” అంటూ ప్రశ్నించగా, కొందరు నేతలు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధిపై దాడి జరిగిందని, తన కళ్లజోడు పగిలిపోయిందని బాధితుడు తెలిపాడు. పార్టీ అధ్యక్షుడితో వాదన జరుగుతున్న సమయంలో తనపై గుద్దులు పడ్డాయని, ఇంతకుముందెప్పుడూ ఇలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ ఘర్షణకు కారణంగా సర్పంచులు, ఉపసర్పంచుల సన్మాన కార్యక్రమం రద్దు అంశం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముందుగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసినా, పార్టీ అధ్యక్షుడు అనుమతి ఇవ్వకుండా అకస్మాత్తుగా ప్రోగ్రామ్‌ను క్యాన్సల్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. షాలువాలు, మోమెంటోలు, భోజన ఏర్పాట్లు పూర్తయ్యాక కూడా కార్యక్రమాన్ని నిలిపివేయడం వల్ల అసంతృప్తి చెలరేగిందని నేతలు చెబుతున్నారు.

ఘటనపై ఒక నేత మాట్లాడుతూ, “మాపై దాడి చేసిన వ్యక్తి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేదంటే దీనిని వదిలిపెట్టేది లేదు” అంటూ హెచ్చరికలు చేశాడు. అవసరమైతే తన బలాన్ని చూపిస్తానని, ఒక్క మెసేజ్ పెడితే పరిస్థితి మరోలా ఉంటుందని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పార్టీలో అంతర్గత విభేదాలు ఈ స్థాయికి చేరడం, మీడియాపై దాడులు జరగడం బీజేపీకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఈ ఘటనపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, బాధ్యులపై చర్యలు ఉంటాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడాలని పలువురు జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *