సీఎం రేవంత్ రెడ్డి గైర్హాజరీలో కాంగ్రెస్‌లో కలకలం: నలుగురు మంత్రుల అత్యవసర భేటీ వెనుక అసలు కథ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఇప్పుడు బయటపడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా, పీసీసీ చీఫ్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే రాష్ట్రంలో నలుగురు కీలక మంత్రులు అత్యవసరంగా సమావేశం కావడం రాజకీయంగా సంచలనంగా మారింది.

సోమవారం ‘ఎట్ హోమ్’ విందు అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశం సుమారు రెండున్నర గంటలకు పైగా కొనసాగినట్లు సమాచారం. ఈ భేటీ మధ్యలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా చేరడం చర్చనీయాంశంగా మారింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సమావేశంలో ప్రధానంగా సింగరేణి బొగ్గు స్కామ్‌పై ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ మీడియాలో వచ్చిన కథనాలు, వాటి వెనుక ఉన్న శక్తులపై లోతైన చర్చ జరిగింది. కొంతమంది కాంగ్రెస్ నేతలు కావాలనే పార్టీకి నష్టం కలిగించేలా లీకులు ఇస్తూ, నేతల మధ్య చిచ్చు పెడుతున్నారని మంత్రులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేకపోతే పార్టీకి భారీ నష్టం జరుగుతుందని, కలిసి కట్టిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ భేటీలో సీనియర్ మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ సమావేశం సాధారణమేనని పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించినప్పటికీ, పార్టీ లోపల కొనసాగుతున్న అధికార పోరు మాత్రం రోజు రోజుకు తీవ్రమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నైనీ బొగ్గు స్కామ్ అంశంతో మొదలైన ఈ వివాదం, క్రమంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత దావానలంలా మారుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా శైలిపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న అసలు కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు తాడో పేడో తేల్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది.

రేవంత్ రెడ్డి వెనక పూర్తి స్థాయిలో నిలబడే నాయకత్వం పార్టీ లోపల లేకపోవడం, భవిష్యత్తులో కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితులు తీసుకురావచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. అవసరమైతే రాజకీయ ప్రత్యామ్నాయాలపై కూడా రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్నారని, ఇతర పార్టీలతో సంబంధాలు పెంచుకుంటున్నారన్న చర్చలు కూడా రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *