బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పరిశీలనకు వస్తున్న విషయం ముందుగానే తెలుసుకున్న అధికారులు, వాస్తవ పరిస్థితులను దాచిపెట్టేందుకు మట్టి కుప్పలపై బొగ్గును పరచి చూపించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.
“నేను ఇక్కడికి వస్తానని నాలుగు, ఐదు రోజుల ముందే వారికి సమాచారం చేరింది. నేను వచ్చి చూస్తానని తెలుసుకుని బయట ప్రాంతాల నుంచి బొగ్గును తెప్పించి ఓబీ (ఓవర్ బర్డెన్) మట్టి కుప్పలపై ఒక పొరలా పరచారు. అది అసలు నాణ్యమైన బొగ్గు కూడా కాదు. థర్డ్ గ్రేడ్ రిజెక్టెడ్ కోల్‌ను తీసుకొచ్చి మట్టిపై చల్లి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు” అని హరీష్ రావు పేర్కొన్నారు.
ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని, వాటిని కార్మికులే తనకు పంపించారని తెలిపారు. “నీలాంటి కార్మికుడే నాకు ఈ వీడియో పంపించాడు. మీరు వస్తున్నారని తెలిసి బయట నుంచి బొగ్గు తీసుకొచ్చి మట్టిపై చల్లుతున్నారని చెప్పాడు” అని అన్నారు.
ఈ అంశంపై మీడియా కూడా స్వతంత్రంగా పరిశీలించాలని హరీష్ రావు సూచించారు. “రేపు విలేకరులు అక్కడికి వెళ్లి ఒక మూర తవ్వి చూడండి. పైపైన బొగ్గు కనిపిస్తుంది. కానీ కొద్దిగా తవ్వితే కింద మట్టి మాత్రమే ఉంటుంది. నిజం ప్రజలకు తెలుస్తుంది” అని అన్నారు.
ఇటీవల మరో కార్మికుడు తనకు సమాచారం అందించేందుకు ప్రయత్నించగా, అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని హరీష్ రావు ఆరోపించారు. “ఆ కార్మికుడు నాకు ఫోన్ చేసి తన మొబైల్ తీసుకున్నారని చెప్పాడు. నేను అవసరమైతే కొత్త ఫోన్ కొనిస్తానని చెప్పాను. కానీ నిజాలు బయటకు రావాల్సిందే” అని వ్యాఖ్యానించారు.
ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు లేదా ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

